ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ దూకుడు మీద ఉంది. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అణచివేయాలని ఆ పార్టీ తపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారనే సమాచారంతో, టీడీపీ పెద్ద ఎత్తున ఆయన్ను అడ్డుకునేందుకు వ్యూహంపన్నింది. పుంగనూరులో టీడీపీ శ్రేణులు భారీగా రోడ్లపైకి వచ్చి వైసీపీ నాయకుల ఇళ్లపై దాడికి తెగబడ్డాయి.
దీంతో పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరులు వెంకటరెడ్డి యాదవ్, అలాగే నరసింహులు ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడి చేసి, వారిని గాయపరిచాయి. పుంగనూరులో వైసీపీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతున్నారనే సమాచారంతోనే టీడీపీ ఈ గొడవకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. పుంగనూరులో టీడీపీ ఆందోళనను తిరుపతిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు.
ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పుంగనూరు రావద్దని పెద్దిరెడ్డికి పోలీసులు సూచించారు. దీంతో ఆయన పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిసింది. ఈ సందర్భంగా పుంగనూరులో టీడీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి చంద్రబాబు వెళితే, అడ్డుకున్నారని గుర్తు చేశారు. అలాగే పుంగనూరుకు బాబు వస్తానంటే, ఆయన్ను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారని ఆరోపించారు.
నాడు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసులు పెట్టించి, హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడాయన పుంగనూరు ఎలా వస్తారో తాము చూస్తామని హెచ్చరించారు. అరాచకానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెరలేపారని, దాని ఫలితాలు ఆయన అనుభవించాల్సిందే అని వారు హెచ్చరించడం గమనార్హం.