అధికారం వచ్చే వరకూ…. అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తారు. ఒకసారి అధికారం చేతికొచ్చిన తర్వాత, అంత వరకూ వెన్నంటి వుండేవారిని సైతం అణచివేయాలని చూస్తుంటారు. రాజకీయం అంటే ఇదే. రాజుల కాలం నుంచి కుట్ర రాజకీయాల్ని కథలుకథలుగా వింటున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రతిపక్షమనేదే లేకుండా జనం ఒకే పక్షానికి పట్టం కట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అంచనా కట్టలేం. ప్రజాతీర్పు ప్రతి ఐదేళ్లకూ ఎంతో భిన్నంగా వుంటుంది. ఆదరించారని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే, ఆ తర్వాత ఆ ప్రజలే బుద్ధి చెబుతుంటారు. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని మెలగాలని పెద్దలు చెబుతుంటారు. అయితే అధికారం అనేది ఊరికే ఉండనివ్వదు. ఏదో ఒక తప్పు చేయిస్తూనే వుంటుంది. అధికారం చేపట్టిన మొదట్లో పాలకులు ఎన్నెన్నో చెబుతుంటారు. తాము చేసేవన్నీ సరైనవే అనే భ్రమలో చేయకూడని తప్పులు చేస్తుంటారు. ఇందుకు ఎవరూ అతీతులు కారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై టీడీపీ అనుమానపు చూపు చూస్తోందనే చర్చకు తెరలేచింది. ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబుతో పాటు పవన్‌కల్యాణ్ ఫొటోను కూడా పెట్టాలనే ఆదేశాలు వెళ్లాయని అంటున్నారు. అయితే పవన్‌కల్యాణ్‌ను తనతో సమానంగా చంద్రబాబు చూడడాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ్టి అధికారం పవన్‌కల్యాణ్ భిక్షే అన్నట్టుగా తయారైందని, ఈ ప్రచారాన్ని టీడీపీ అసలు సహించడం లేదు.
బాబుతో పాటు పవన్ ఫొటోలు కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని ఆదేశాలిస్తే, భవిష్యత్‌లో అన్ని విషయాల్లోనూ సమానంగా చూడాలని జనసేన నుంచి డిమాండ్ వస్తుందని టీడీపీ ఆందోళన చెందుతోంది. రాజకీయ అవసరాల రీత్యా జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అంత మాత్రానా… పాలనలో కూడా పవన్‌ను భాగస్వామ్యం చేస్తే, ప్రతి నిర్ణయంలోనూ ఆయన జోక్యం చేసుకంటారనే భయం టీడీపీలో కనిపిస్తోంది. ఇలాంటి ఆలోచనలన్నీ ప్రస్తుతానికి చంద్రబాబు వరకూ చేరలేదని చెప్పొచ్చు. ఒకవేళ ఆయన మనసులో పవన్‌పై వ్యతిరేక ఆలోచనల్ని నింపితే, అప్పుడు ఏమవుతుందనేది కాలమే తేల్చాలి.