మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు చేయాల్సిన పని కన్నా వేరే పనుల మీద దృష్టి పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వం లోకల్ చేపట్టే ప్రతి పని భారం వాటి మీదే పడుతోంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, ఆరోగ్యం, పరిశుభ్రత, స్ధానిక విద్య, రోడ్లు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సి వుంది. ఖర్చుకు తగినట్లు ఆదాయం సమకూర్చుకోవాలి. కేంద్రం ఇచ్చే నిధులు వాడుకోవాలి. కానీ చాలా కాలంగా అలా జరగడం లేదు. అలవి కాని అనేక ఖర్చులు స్ధానిక సంస్థల మీద పడుతున్నాయి. కార్పొరేషన్ల పేరు చెప్పి, రుణాలు తెచ్చి పథకాలకు వాడడం అన్నది అలవాటు అయింది.
2019 ఎన్నికల టైమ్ లో పసుపు కుంకుమ రుణాల భారాన్ని కార్పొరేషన్లు సైతం మోసాయి. రోజు రోజుకూ అపార్ట్ మెంట్లు పెరుగుతున్నాయి. టన్నుల కొద్దీ చెత్త పోగవుతోంది. దీని కోసం కాస్త పన్ను వేసి వసూలు చేయాలనుకుంటే, నానా యాగీ చేసారు. వేయి నుంచి రెండు వేలు అపార్ట్ మెంట్ మెయింట్ నెన్స్ భరించే నివాసులు, ముఫై రూపాయలు చెత్త ఖర్చు భరించలేరా.. జనాల్ని రెచ్చగొట్టి తప్పు దారి పట్టించారు.
ఇప్పుడు ఈ ఖర్చంతా స్ధానిక సంస్ధలే భరించాలి. హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాన్నేమీ భర్తీ చేయదు. దీని వల్ల ఆస్తి పన్నులు పెంచక తప్పదు. అయితే ఒకటే ధీమా. ఏ మున్సిపాల్టీ ఆస్తి పన్ను పెంచినా, దాన్ని మీడియాలోకి రానివ్వకుండా నొక్కేస్తారు. అందువల్ల ముఫై రూపాయల చెత్త పన్ను భారం తెలిసినట్లు, వందల రూపాయల ఆస్తి పన్ను భారం తెలియదు.
ఇప్పుడు అన్న క్యాంటీన్ లు మళ్లీ మొదలవుతున్నాయి. పదేళ్ల క్రితం అయిదు రూపాయలకు టిఫెన్, భోజనం పెట్టారు. స్తోమత లేని వారితో పాటు స్తోమత వున్న వారు కూడా క్యూ కట్టారు. ప్రభుత్వం దాదాపు ప్రతి టిఫిన్ మీద, ప్రతి భోజనం మీద 60 నుంచి 70 రూపాయలు భరించింది. ఇస్కాన్ లాంటి సేవా సంస్థలు ఈ పథకం ద్వారా లాభ పడ్డాయి. కానీ జనాలు పట్టించుకోలేదు. ఎందుకంటే రోజుకు పదిహేను రూపాయలతో పని జరిగిపోతోంది కదా?
ఇప్పుడు ఈ పథకం మళ్లీ వచ్చింది. రేట్లు భయంకరంగా పెరిగిన ఈ కాలంలో కూడా అయిదు రూపాయలకే టిఫిన్ అందించాలి. కానీ ఈసారి సరఫరా దారులకు ఇచ్చే మొత్తం బాగా పెరుగుతుంది. మరి వీటి నిర్వహణ స్ధానిక సంస్థల మీద వేస్తారో, ప్రభుత్వం భర్తి చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అన్న క్యాంటీన్ భవనాల నిర్మాణం, నిర్వహణ, విద్యుత్, నీరు ఇవన్నీ స్ధానిక సంస్థలే భరించాలి.
మొత్తం మీద ఇటు పన్నులు పెంచకూడదు, అటు అన్ని రకాల ఖర్చులు భరించాలి అంటే స్ధానిక సంస్థలకు కాస్త కష్టమే.