ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుణపాఠం నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా జగన్‌ను అభిమానించేవారు… ఆయన మారాలబ్బా అని అంటున్నారు. పార్టీ పరమైన నియామకాలు చేపట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వుంటుంది. కానీ ఇంత ఘోర పరాజయం తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రానట్టే కనిపిస్తోంది.
తాజాగా రాజ్యసభ, లోక్‌సభ, అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుల నియామకంలో జగన్ మరోసారి తన మార్క్ తప్పటడుగు వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్‌సభ, రాజ్యసభ వైసీపీ పక్ష నాయకులుగా మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. తన సామాజిక వర్గానికే చెందిన ముగ్గురు ఎంపీలకు కీలక పదవులు అప్పగిస్తే, మిగిలిన సామాజిక వర్గాలు వైసీపీ వైపు ఎందుకు చూస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రాజ్యసభ సీట్లు ఇవ్వడంలో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసినప్పటికీ, పవర్ విషయంలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా నెగెటివ్ సంకేతాలు పంపినట్టు అవుతుంది. గతంలో ఎలా ఉన్నా, ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. రాజ్యసభ, లోక్‌సభలలో వాళ్లిద్దరినే కొనసాగించినా, కనీసం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మరో సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైసీపీ అంటే అందరిదీ అనే భావన కలిగేలా మసలు కోవాల్సిన అసవరం వుంది. తమ ప్రత్యర్థి పార్టీలో ఏం జరుగుతున్నదో ఒకసారి చూసి తెలుసుకుంటే బాగుంటుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యాదవ సామాజిక వర్గం నాయకుడిని నియమిస్తున్నారు. జగన్ రాజకీయ నిర్ణయాలు… అతివృష్టి, అనావృష్టి అన్నట్టుగా ఉంటాయి. ఈ దఫా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేస్తే మిగిలిన పార్టీల కంటే గొప్పగా సామాజిక సమీకరణలపై పెద్దపీట వేశారు.
అయితే ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ పవర్ అంతా జగన్ సామాజిక వర్గం నేతల్లో చేతుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే రాజకీయంగా దెబ్బ కొట్టింది. ఇప్పటికైనా పదవులు, పవర్ పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది.