జ‌గ‌న్‌, మిథున్ స‌హా వైసీపీ ప్ర‌ముఖులు జైలుకే!

మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఆ పార్టీ ముఖ్య నాయ‌కులైన ఎంపీలు మిథున్‌రెడ్డి, విజ‌య్‌సాయిరెడ్డి త‌దిత‌రుల్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జైలుకు పంప‌డానికి అధికార టీడీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దులుతోంది.  గ‌త ప్ర‌భుత్వ…

మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఆ పార్టీ ముఖ్య నాయ‌కులైన ఎంపీలు మిథున్‌రెడ్డి, విజ‌య్‌సాయిరెడ్డి త‌దిత‌రుల్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జైలుకు పంప‌డానికి అధికార టీడీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దులుతోంది.  గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని కేసుల్లో ఇరికించ‌డానికి మ‌ద్యం పాల‌సీని ఆయుధంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎంచుకుంది. వైసీపీ ప్ర‌భుత్వ మ‌ద్యం పాల‌సీలోని లొసుగుల‌ను గుర్తించి, వాటిని నాటి పాల‌కుల‌పై అస్త్రాలుగా ప్ర‌యోగించ‌డానికి అన్ని ఏర్పాట్ల‌ను ప్ర‌భుత్వం చేస్తోంది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కు మించిపోయేలా ఏపీలో మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌ని టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు చాలా కాలంగా ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ మ‌ద్యం స్కామ్‌పై ఈడీ, సీబీఐల‌తో ద‌ర్యాప్తు చేయించాలంటూ ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఎన్నిక‌ల‌కు ముందు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు కూట‌మి అధికారంలో వుండ‌డంతో కేసుల న‌మోదుకు ఉత్సాహం చూపుతోంది. మ‌రీ ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబును స్కిల్ స్కామ్‌లోనూ అలాగే ప‌లువురు మాజీ మంత్రులపై కూడా కేసులు, జైలుపాలు చేయ‌డంతో, ఈ ద‌ఫా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని టీడీపీ నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

అందుకే ప్ర‌భుత్వం కొలువుదీర‌గానే మొద‌ట వైసీపీ హ‌యాంలో అవినీతిపై దృష్టి సారించ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. జ‌గ‌న్ స‌హా వైసీపీ కీల‌క నేత‌ల్ని జైలుకు పంప‌డానికి రెండో ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఏపీ మ‌ద్యం స్కామ్‌పై ఇప్ప‌టికే సంబంధిత విభాగం ఉన్న‌తాధికారి వాసుదేవ‌రెడ్డిపై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఇంట్లో సోదాలు కూడా చేశారు. ముంద‌స్తు బెయిల్ కోరుతూ ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించినా సానుకూల ఫ‌లితం పొంద‌లేక‌పోయారు.

వైసీపీ ముఖ్య నేత‌ల్ని మొద‌టి రెండుమూడేళ్ల‌లోనే జైలుపాలు చేయాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆలోచిస్తున్నార‌ని తెలిసింది. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌తో పాటు ఇత‌ర వైసీపీ నేత‌ల్ని జైలుకి పంపితే సానుభూతి వ‌చ్చే ప్ర‌మాదం వుంద‌ని, కావున ఏదైనా ఇప్పుడే చేయాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఫైళ్ల‌ను క‌దిలిస్తున్నారు. ఈ కేసుల్లో బ‌ల‌మెంత‌? అరెస్ట్ నుంచి జ‌గ‌న్ త‌దిత‌ర వైసీపీ పెద్ద‌లు త‌ప్పించుకుంటారా? త‌దిత‌ర అంశాలను కాలం నిగ్గు తేల్చాల్సి వుంది.