ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. ఏపీ హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనితను నియమించడం విశేషం. అలాగే ఆర్థికశాఖ, శాసనసభ వ్యవహారాలశాఖను పయ్యావుల కేశవ్‌కు, ఆర్థిక మంత్రిత్వ శాఖను అనగాని సత్యప్రసాద్‌కు అప్పగించడం విశేషం. ఇక ముఖ్యమైన నాయకులు పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నారా లోకేశ్, పి.నారాయణ తదితరులకు ముందే ఊహించినట్టుగా మంత్రిత్వశాఖలను కేటాయించారు.
ప్రధానంగా హోంశాఖ మంత్రి ఎవరికి ఇస్తారనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పవన్‌కల్యాణ్‌కు ఇస్తారని జనసేన శ్రేణులు ఆశించాయి. అయితే పవన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శాఖను ఇవ్వొద్దని చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి సొంత పార్టీ నేతల నుంచి వచ్చింది. ఎందుకంటే పవన్‌కు హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తే, ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధించేలా కేసులు పెట్టే అవకాశం వుండదు. అందుకే పవన్‌కు హోంశాఖ ఇవ్వలేదని తెలుస్తోంది.
2019లో కొవ్వూరులో వంగలపూడి అనితపై గెలిచిన తానేటి వనిత .. వైసీపీ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. వైఎస్ జగన్ కేబినెట్‌లో రెండు విడతల్లోనూ మహిళలే హోంశాఖ మంత్రులు కావడం తెలిసిందే. మొదట రెండున్నరేళ్ల పాటు మేకతోటి సుచరిత, ఆ తర్వాత వనిత కీలక మంత్రిత్వశాఖ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఇద్దరూ దళిత మహిళలే కావడం గమనార్హం.
ఈ విషయంలో జగన్‌ను చంద్రబాబు అనుసరించారు. దళిత మహిళ అయిన వంగలపూడి అనితకు చంద్రబాబు కీలకమైన హోంశాఖ మంత్రిత్వ శాఖను అప్పగించడం చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో అనిత తనపై చంద్రబాబు ఉంచిన నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటారో చూడాలి.