నూతన సీఎం చంద్రబాబునాయుడు తిరుమల పర్యటనలో ఉన్నతాధికారులు ప్రొటోకాల్ పాటించలేదని, ఆయన సీరియస్ అయ్యారంటూ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో ఈవో ధర్మారెడ్డిని సెలవుపై పంపారు. దీంతో టీటీడీ తిరుపతి జేఈవో వీరబ్రహ్మంకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం సాయంత్రానికి తిరుమల చేరుకున్నారు.
బాబు తిరుమల చేరుకునే సమయానికి కొండపై వర్షం పడుతోంది. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిశోర్ సిద్ధంగా ఉన్నారు. అయితే వర్షం పడుతున్న కారణంగా, చంద్రబాబును నేరుగా లోపలకి తీసుకొస్తామని, అక్కడ స్వాగతం పలకాలని సెక్యూరిటీ అధికారులు టీటీడీ ఉన్నతాధికారులకు సూచించినట్టు తెలిసింది. సెక్యూరిటీ అధికారుల సూచనల మేరకు పద్మావతి గెస్ట్ హౌస్‌లో బాబుకు జేఈవో, సీవీఎస్వో ఘన స్వాగతం పలికారు.
అయితే వీరబ్రహ్మం ప్రొటోకాల్ పాటించలేదని, దీంతో చంద్రబాబునాయుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని, కనీసం పుష్పగుచ్చం కూడా తీసుకోడానికి నిరాకరించినట్టు ఎల్లో పత్రిక రాసుకొచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నియమితులైన అధికారులు కావడం వల్లే చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారనే అర్థం ధ్వనించేలా ఎల్లో మీడియా కథనాలు రాయడం చర్చనీయాంశమైంది. ఒకవేళ చంద్రబాబు ఆగ్రహించింది, పుష్ప గుచ్చం తీసుకోలేదన్నది నిజమే అయితే రాసినా సమస్య లేదు.
అలాంటిదేమీ లేకుండానే, అధికారులను భయపెట్టేలా కథనాలు రాయడం చర్చనీయాంశమైంది. ఇలాంటి వార్తలతో చంద్రబాబు స్థాయిని దిగజార్చడం తప్ప, ఎలాంటి ప్రయోజనం వుండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు చిన్నపిల్లల్లా అధికారులపై ఉత్తి పుణ్యానికే కోపగించుకుంటున్నారా? అనే చర్చకు తెరలేచేలా కథనాలున్నాయని పలువురు అంటున్నారు. అంతేకాదు, వీరబ్రహ్మం, నరసింహకిశోర్ వివాద రహితులు. అలాంటి వారిపై లేనివి రాయడం వల్ల చంద్రబాబు సర్కార్‌కే అప్రతిష్ట అని చెప్పక తప్పదు.