చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సభా వేదికపై తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసైకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా క్లాస్ తీసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బహిరంగ సభా వేదికపై మహిళా నాయకురాలిని అవమానించే రీతిలో అమిత్‌షా వ్యవహరించడం ఏంటంటూ తమిళినాడులో బీజేపీ వ్యతిరేక పక్షాలు గళమెత్తాయి.
ఈ వ్యవహారంపై బాధితురాలైన తమిళిసై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రచారమవుతున్నట్టు తనను అమిత్‌షా అవమానించలేదని చెప్పుకొచ్చారామె. పైగా తనను ప్రోత్సహించారని ఆమె పేర్కొనడం విశేషం. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో హోంమంత్రి అమిత్ షాను మొదటిసారి కలిసినట్టు ఆమె వెల్లడించారు. ఎన్నికల తర్వాత సమీకరణలు, తాను ఎదుర్కొన్న సవాళ్లు గురించి అడిగి తెలుసుకోవడానికి అమిత్‌షా పిలిచారని ఆమె పేర్కొన్నారు.
అమిత్‌షాకు వివరిస్తున్నప్పుడు, సమయం తక్కువగా ఉన్నందున.. ఆయనే మాట్లాడారని తమిళిసై వివరించారు. రాజకీయ, నియోజకవర్గ పనులు చూసుకోవాలని అమిత్‌షా సలహా ఇచ్చారని ఆమె తెలిపారు. ఆ మాటలు తనకెంతో భరోసా ఇచ్చాయని వెల్లడించారు. కానీ ఏదో జరిగినట్లుగా సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు.
అమిత్‌షాకు సన్నిహితుడైన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైతో తమిళిసైకి తీవ్రస్థాయిలో విబేధాలున్నాయి. వాళ్లిద్దరి మధ్య డైలాగ్ వార్ నడిచింది. తమిళనాడులో బీజేపీలోని అసమ్మతిపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో బీజేపీకి రాజకీయంగా నష్టం జరిగింది. తన మనిషైన అన్నామలైతో గొడవపడ్డ తమిళిసైపై అమిత్‌షా ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళిసైకి అమిత్‌షా క్లాస్ తీసుకున్న వీడియో బలం చేకూర్చేలా వుంది.