చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది కొత్తవారే. లోకేశ్ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్తవారికి చోటు కల్పించారనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం కావడంతో జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ తరపున ఒకరు చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు.
అయితే మంత్రుల శాఖలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిగో, అదిగో అంటూ మీడియాకు లీక్‌లు ఇస్తున్నారు. ఫలానా మంత్రికి హోంశాఖ లేదా వైద్యారోగ్య శాఖ అంటూ ఊదరగొడుతున్నారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబునాయుడు తిరుమలకు వెళ్లారు. దైవ దర్శనం అనంతరం మరుసటి రోజు ఆయన తిరిగి వచ్చారు.
గురువారం సాయంత్రానికి మంత్రుల శాఖల కేటాయింపుపై స్పష్టత వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రాలేదు. జనసేనకు ఇచ్చే మూడు శాఖలకు సంబంధించి చంద్రబాబు రాజగురువు పత్రిక రాయడం విశేషం. పవన్‌కు హోంశాఖ ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో, దానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు చంద్రబాబునాయుడి మార్క్ రాత రాయించడం గమనార్హం. పవన్‌కల్యాణ్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు ఇస్తున్నట్టు టీడీపీ అధికారిక మీడియా ప్రకటించింది.
జనసేనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారాన్ని విస్తృతంగా చేయనున్నారు. ఆచరణలో ఎలా ఉన్నా, మీడియా ద్వారా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఇదిలా వుండగా మంత్రులకు శాఖల కేటాయింపుపై జరుగుతున్న జాప్యంపై చర్చకు తెరలేచింది. ఇవాళైనా మంత్రులకు శాఖలు కేటాయిస్తారా? లేదా? అని చర్చించుకుంటున్నారు.