చిత్రం: మాహరాజా
రేటింగ్: 3/5
తారాగణం: విజయ్ సేతుపతి, అనురాగ్ కాశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ సుబ్రమణియం, అభిరామి, అరుళ్ దాస్, మునీష్ కాంత్, మణికందన్, సింగంపులి, భారతి రాజా, వినోద్ సాగర్, తేనెప్పన్ తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్
కెమెరా: దినేష్ పురుషోత్తమన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
నిర్మాత: సుధన్ సుందరం, జగదీష్ పళనీ స్వామి
రచన: నిత్తిలన్ సామినాథన్, రాం మురళి
దర్శకత్వం: నిత్తిలన్ సామినాథన్
విడుదల తేదీ: 14 జూన్ 2024
విజయ్ సేతుపతి సినిమాలో ఒక ముఖ్యపాత్రలో ఉన్నాడంటేనే ఆసక్తిగా వెళ్లి చూసేవాళ్లున్నారు. అలాంటిది ప్రధానపాత్రలో అతను కనిపిస్తున్నాడంటే నేటి తరం సినీ అభిమానుల అంచనాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఎందుకంటే అతని సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని నమ్మకం.
మహారాజ (విజయ్ సేతుపతి) ఒక బార్బర్. అతనికి భార్య, రెండేళ్లు కూడా నిండని కూతురు. భార్య యాక్సిడెంటులో మరణిస్తుంది. అదే యాక్సిడెంటులో కూతురు మీద ఒక ఇనుప డస్ట్ బిన్ మీద పడడంతో ఆ డస్ట్ బిన్ ఒక కవచంలా పని చేసి ఆ పిల్ల ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడుతుంది. ఆ డస్ట్ బిన్ ని ప్రాణప్రదంగా చూసుకుంటూ దానికి “లక్ష్మి” అని పేరుపెట్టి తండ్రీ కూతుళ్లిద్దరూ దైవంతో సమానంగా చూసుకుంటూ ఉంటారు. కూతురు హై స్కూల్లో చదువుతూ స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్తుంది.
ఇంతలో ఒక రోజు చెవి దగ్గర గాయంతో పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇంట్లో దొంగలు పడి తన “లక్ష్మి” ని ఎత్తుకుపోయారని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. ఒక ఖాళీ డస్ట్ బిన్ ని ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎవరికుంటుంది? దాని చుట్టూనే కథంతా తిరుగుతుంది.
ఈ కథని ఇంతకంటే చెప్పకూడదు. ఎందుకంటే ఇదొక చక్కని కథనం. స్క్రీన్ ప్లే వండర్ అన్నమాట.
కథని ఎలా చెప్పాలి?, ఎంత వరకు చెబుతూ వెళ్లాలి?, ఏది ఎక్కడ రివీల్ చెయ్యాలి?, ఎక్కడ ఏ ట్విస్ట్ ఇచ్చి ఎలా మెలిపెట్టాలి? వీటి మధ్య భావోద్వేగాలని, సున్నితమైన హాస్యాన్ని కథ నుంచి పక్కకు పోయే ట్రాకుల్లో కాకుండా కథలోంచే, ఆ పాత్రల నుంచే ఎలా రాబట్టాలి? ఈ పాఠాలన్నీ నేర్చుకోవచ్చు ఈ సినిమా చూసి.
విజయ్ సేతుపతిది దేనికీ ఇన్స్టెంట్ గా రియాక్టవని పాత్ర. ఏ సంఘటనైనా మనసుతో చాలా తీవ్రంగా స్పందిస్తాడు.. అయితే చాలా నెమ్మదిగా! అంతే కాదు… ఆ పాత్రకి ఆత్మాభిమానం, కొట్టిన వాళ్లని వెంటనే తిరిగి కొట్టేసే ఇంపల్సివ్ నేచర్ ఉండవు. మానసికంగా మొండివాడు, శారీరకంగా బలాఢ్యుడు. ఇవి అతని పాత్ర స్వభావాలు. శాంతంగా కనిపించే ఈ బార్బర్ కొన్ని విషయాల్లో బార్బారియస్ గా కూడా మారతాడు. ఇలాంటి క్యారెక్టరైజేషన్, ఆర్క్ ఉన్న పాత్రని కన్విన్సింగ్ గా పోషించాడు విజయ్ సేతుపతి.
ఇక ఇందులో ప్రతినాయక పాత్ర పోషించినది సుప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్. కౄరత్వంతో పాటూ ఒకానొక వ్యక్తిగతమైన ఎమోషనల్ వీక్నెస్ ని క్యారీ చేస్తూ చక్కగా నటించాడు.
అలాగే ఇందులో ఆకట్టుకున్న మరొక పాత్ర ఇన్స్పెక్టర్ గా కనిపించిన నటరాజన్ సుబ్రమణియం. సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా ఒకటి రెండు సీన్స్ లో కనిపించారు.
మమతా మోహన్ దాస్, అభిరామి ఇందులో ముఖ్యమైన స్త్రీ పాత్రలు. అలాగని వాళ్లని హీరోయిన్స్ అనలేం. మమత మోహన్ దాస్ చాలా కాలం తర్వాత కనిపించింది, కంటికింపుగా ఉంది. విలన్ భార్యగా అభిరామి ఓకే.
ఎక్కడా పాటలు, సినిమాటిక్ రొమాన్స్ వగైరాలు లేవు. అందుకే కొంత వరకు సినిమా చూస్తున్న ఫీలింగ్ కాకుండా జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం బాగుంది. కథనంలో ఎక్కడా ల్యాగ్ లేదు, దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కూర్చోబెట్టింది. స్క్రీన్ ప్లే కి తగిన ఎడిటింగ్ ని కూడా మెచ్చుకోవాలి. ఇక ఈ సినిమాకి నిజమైన మెయిన్ హీరో మాత్రం స్క్రీన్ ప్లే రాసుకున్న దర్శకుడు మరియు రాం మురళి.
సినిమా మొదలైన పది నిమిషాలకే సమస్య, సంఘర్షణ మొదలైపోతాయి. ఏ సన్నివేశమూ, ఏ సంఘటన వృధా పోకుండా అన్నీ ఒకదానితో ఒకటి గుదిగుచ్చబడి క్లైమాక్స్ కి సహకరించాయి.
ప్రధామార్ధం సటిల్ హ్యూమర్ తోనూ, విజయ్ సేతుపతి పాత్ర స్వభావంలోని ప్రత్యేకతలతోనూ నడిచిపోయింది. ద్వితీయార్ధంలో మాత్రం నవ్వులు తగ్గిపోయి సీరియస్ టోన్ పెరుగుతూ వచ్చింది. కథని ఊహించడానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ డైవర్ట్ చేస్తూ నడిపాడు దర్శకుడు.
“దృశ్యం” సినిమాలో కథానాయకుడి తెలివి ఇందులో మాహారాజా తెలివి మరొక విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల కన్వీనియన్స్ కోసం కొన్ని పాత్రల్ని జొప్పించినట్టు కనిపించినా అవి కూడా కథని కన్విన్సింగ్ గా నడపడానికి ఉపయోగపడ్డాయి.
ఈ చిత్రంలో ఉన్న మైనస్ ఏదైనా చెప్పుకోలంటే…ఇది అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చదు. హింస, క్రైం నచ్చనివారు దూరంగా ఉంటే మంచిది. అలాగే పాటలు, రొమాన్స్ కావాలన్నా ఇందులో దొరకదు. రొటీన్ ఫార్ములా సినిమాలు కాకుండా వెరైటీ చిత్రాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ చిత్రం నచ్చే అవకాశముంది. సస్పెన్స్, హ్యూమర్, సెంటిమెంట్ తో పాటూ క్రైం, హింస పాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంచనాలు పెట్టుకుని చూసినా బానే ఉందనిపిస్తుంది. ఏ అంచనాలు లేకుండా వెళితే మరింత నచ్చొచ్చు.
బాటం లైన్: ఎమోషనల్ బార్బర్
Intha goppa cinema ki idhaa nuvu iche review, worst fellow.