వైసీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఇది కష్టకాలం. ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. మళ్లీ మొదటి నుంచి రాజకీయం మొదలు పెట్టాల్సిన దయనీయ స్థితి. ఇలాంటి దుస్థితి వస్తుందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలలో కూడా ఊహించలేదు. జీవితమైనా, రాజకీయమైనా ఒక్కోసారి ఇట్లే వుంటాయి. కష్టనష్టాలు ఎదురైనప్పుడు ఎదుర్కొని నిలబడితేనే భవిష్యత్. లేదంటే మనిషైనా, రాజకీయ పార్టీ అయినా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు ఎలా వుంటాయనే చర్చకు తెరలేచింది. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన కీలక సమావేశంలో జగన్ భవిష్యత్‌పై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. మళ్లీ రాజకీయంగా ఉవ్వెత్తున పైకి లేచే కాలం వస్తుందని భరోసా నింపే ప్రయత్నం చేశారు.
ఇదే సందర్భంలో తన పార్టీ ఓడిపోవడానికి కారణాలపై ఆయన దృష్టి సారించినట్టు కనిపించలేదు. తప్పుల్ని సరిదిద్దుకుని, ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా కార్యాచరణ తయారు చేసుకోడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించలేదు. అన్నిటికి మించి ఆయనలో ఓటమిపై పశ్చాత్తాపం ఏ మాత్రం కానరాలేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇందుకు ఉదాహరణ జగన్ పలికిన ఈ మాటలే నిదర్శనం.
“చంద్రబాబు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్ల ముందే చంద్రబాబు పాపాలు ఎలా పండుతాయో గతంలో మనమంతా చూశాం. బాబు తప్పులు శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి. వారు చేసిన పాపాలు ఊరికే పోవు. పాపాలు పండేదాకా ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు”
తన హయాంలో చాలా త్వరగా పాపాలు పండడం వల్లే అధికారం కోల్పోవడమే కాదు, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయామనే ఆలోచన జగన్‌లో ఎందుకు రాలేదో అర్థం కాలేదంటున్నారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష పాత్ర దక్కకపోవచ్చు, కానీ 40 శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా 40 శాతం ఓట్లు రావడం చిన్న విషయం కాదు. ఇలాంటి సానుకూల అంశాల్ని పరిగణలోకి తీసుకుంటూనే, తన పాలనలోని ఘోర తప్పిదాలపై వాస్తవాలను గ్రహించి, మళ్లీ పునరావృతం కానివ్వననే సంకేతాలు ఆయన ఇవ్వాల్సి వుంది.
చంద్రబాబునాయుడి ప్రభుత్వం చేసే పాపాల కోసం జగన్ ఎదురు చూస్తున్నట్టుగా ఆయన మాటలు వింటే అర్థమవుతుంది. ఇప్పుడు అధికారం కోల్పోయి, రాజకీయ భవిష్యత్ ఏంటో దిక్కుతోచని స్థితిలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉన్నారని జగన్ మొదట గుర్తించాలి. ఆ తర్వాత చంద్రబాబు పాపాల గురించి ఆలోచించొచ్చు. మొదట జగన్ చేయాల్సింది… ప్రజాదరణ చూరగొనడం. దీని కోసం ఏం చేయాలో సీరియస్‌గా ఆలోచించాలి.
99 శాతం మేనిఫెస్టోను అమలు చేశా, 2.70 లక్షల కోట్లు ఖర్చు చేశా… లాంటివి పక్కన పెట్టాలి. వాటికి ప్రజామోదం లేదని ఎన్నికల్లో తేలిపోయింది. అయినా వాటినే పట్టుకుని వేలాడడం వల్ల ప్రయోజనం వుండదు. వాటి ప్రయోజనాల కంటే, నష్టపరిచినవే ఎక్కువ అని ప్రజలు భావించారు. అందుకే ఈ తీర్పు. తన పాపాల్ని కడుక్కునే పనిలో నిమగ్నమైతే జగన్‌కు భవిష్యత్ వుంటుంది.
గతాన్ని తవ్వుకుంటూ, అయినా ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదు వంటి మాటలతో ప్రయోజనం శూన్యం. అన్ని వర్గాల ప్రజల మనసుల్ని గాయపరిచేలా పాలన సాగించడం వల్లే ఘోర ఓటమి. ఆ తప్పులేంటో గుర్తించి, ఇగోకు వెళ్లకుండా వాటిని స్వీకరించి, సరిదిద్దుకుని ముందుకెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందని జగన్ గుర్తించాలి. చంద్రబాబు పాపాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే, జగన్‌కు అంత మంచిది.
ఇప్పుడు ఇతరుల తప్పొప్పుల గురించి ఆలోచించేంత సమయం కూడా జగన్‌కు లేదు. ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పుల గురించి తెలుసుకుని, వాటిపై పోస్టుమార్టం చేసుకోడానికే సమయం సరిపోదు. కావున జగన్ తన పాలనలోని పాపాలపై దృష్టి సారిస్తే మంచిది.