జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు ఆశించిన మంత్రిత్వ శాఖ దక్కడం లేదు. పవన్‌కు హోంశాఖ ఇస్తారని, ఇవ్వాలని ఆశించారు. అయితే కీలకమైన ఆ శాఖ ఇచ్చేందుకు టీడీపీ ఇష్టపడలేదు. పవన్‌కు హోంశాఖ ఇస్తే… వైసీపీ నేతలపై తాము అనుకున్న ప్రకారం కేసులు నమోదు చేయడానికి అవకాశం వుండదని టీడీపీ నేతలు భావించారు. ప్రత్యర్థులపై కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పవన్ వ్యతిరేకి. ఈ విషయాన్ని ఆయన ముందే స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పవన్‌కు హోంశాఖ ఇస్తే… ఆయనతో మొదటి రోజు నుంచే విభేదాలు తలెత్తుతాయని చంద్రబాబు, లోకేశ్ భావించారు. దీంతో పవన్‌కు కీలకమైన హోంశాఖ ఇవ్వడానికి నిరాకరించారని తెలుస్తోంది. పవన్‌కు ఇచ్చే మంత్రిత్వ శాఖపై టీడీపీ అనుకూల మీడియా లీక్ ఇచ్చింది.
పవన్‌కల్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలు ఇవ్వనున్నట్టు ఆ లీక్ సారాంశం. ఈ శాఖల్ని పవన్ కోరుకున్నారని రాయడం కొసమెరుపు. ఈ శాఖలు తక్కువని కాదు కానీ, హోంశాఖ అంటే అత్యంత శక్తిమంతమైనవిగా సమాజంలో ఓ రకమైన ప్రచారం వుంది. శాంతిభద్రతల్ని కాపాడే కీలకమైన శాఖ కావడంతో అది పవన్‌కు దక్కితే బాగుండు అని ఆయన అభిమానుల కోరిక. అది నెరవేరే సూచనలు కనిపించడం లేదు.
గ్రామీణ, పంచాయతీరాజ్‌శాఖలు కీలకమైనవి. మన వ్యవస్థ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో నిర్మితమై వుంది. గ్రామాలు బాగుంటే మొత్తం సమాజం అభివృద్ధి చెందుతుంది. గత ఐదేళ్లలో పంచాయతీలకు నిధుల్లేక, సర్పంచులు లబోదిబోమన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గతం కంటే భిన్నమైన పరిస్థితులు ఏ మేరకు ఏర్పడుతాయో చూడాలి. మరీ ముఖ్యంగా ఏదైనా మంచి చేయాలన్న తపన ఉన్న పవన్‌కల్యాణ్ బాధ్యత వహిస్తున్న గ్రామీణ, పంచాయతీరాజ్‌శాఖలకు మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.