ఈ భారం పవన్ మోయగలరా?

గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, అటవీ- పర్యావరణ శాఖలు. మూడుకు మూడూ చాలా పెద్ద మంత్రిత్వ శాఖలు. కీలకమైన శాఖలు. రాష్ట్రంలో అభివృద్ది కనిపించేది ఎక్కువగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల్లోనే. పంచాయతీ రోడ్లు, జిల్లా పరిషత్ రోడ్లు,…

గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, అటవీ- పర్యావరణ శాఖలు. మూడుకు మూడూ చాలా పెద్ద మంత్రిత్వ శాఖలు. కీలకమైన శాఖలు. రాష్ట్రంలో అభివృద్ది కనిపించేది ఎక్కువగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల్లోనే. పంచాయతీ రోడ్లు, జిల్లా పరిషత్ రోడ్లు, జిల్లా పరిషత్ భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, ఇవన్నీ వీటిలోకే వస్తాయి.

జిల్లా పరిషత్ టీచర్ల విభాగం కూడా పెద్దదే. కొత్తగా మంత్రి అయ్యే వారికి వీటిలో ఒక్క శాఖ ఇచ్చినా చాలా పెద్ద భారం అవుతుంది. అలాంటది తొలిసారి ఎమ్మెల్యే, మంత్రి అవుతున్న పవన్ కు ఈ మూడూ కేటాయిస్తారనే వార్తలు వినవస్తున్నాయి. అంటే అలవి కాని భారం పవన్ మీద మోపడమే అవుతుంది. ఎంత సహాయ మంత్రి వున్నా, పై నుంచి చంద్రబాబు పర్యవేక్షించినా, డే టు డే వర్క్ చాలానే వుంటుంది.

అదే సమయంలో గ్రామాల్లో జనసేనను పటిష్టం చేసుకునే అవకాశం కూడా ఎక్కువ వుంటుంది. ఎప్పుడైతే ఈ కీలక మంత్రిత్వ శాఖలు చేతిలో వున్నాయో, లోకల్ క్యాడర్ కు కాస్త ఉపయోగపడడానికి అవకాశం ఎక్కువే వుంటుంది. దాని వల్ల ఎక్కడిక్కడ పార్టీని మరింత విస్తృతం చేయడానికి, బలోపేతం చేయడానికి అవకాశం వుంటుంది. మూడు నిర్మాణాలు, ఆరు ప్రారంభోత్సవాలు అనే విధంగా వుంటుంది కనుక, భవిష్యత్ లో ఎక్కడ చూసినా, శిలాఫలకాలపై పవన్ కళ్యాణ్ పేరు కనిపిస్తుంది.

కానీ నిధుల సమీకరణ అన్నది కూడా పెద్ద బాధ్యత. కేంద్రం నుంచి నాబార్డ్ నుంచి, ఇంకా అనేక సంస్ధల నుంచి నిధుల సమీకరణ మీద దృష్టి పెట్టాల్సి వుంటుంది. ఈ మేరకు వివిధ సంస్ధలతో తరచు సమావేశాలు కావాల్సి వుంటుంది. ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులను కలిసి నిధులు సాధించాల్సి వుంటుంది. అందువల్ల పని భారం చాలా ఎక్కువగా వుంటుంది.

దీని వల్ల ఒకటే సమస్య. పవన్ ఇప్పటికే ఒప్పుకున్న లేదా సగంలో వున్న సినిమాలను పూర్తి చేయడం. ఉస్తాద్ భగత్ సింగ్ కు సమస్య లేదు. ఎందుకంటే జస్ట్ ఓ వారం మాత్రమే వర్క్ చేసారు. అందువల్ల ముందుకు వెళ్లినా, పక్కన పెట్టినా అది వేరే సంగతి. కానీ ఓజి సినిమాను చాలా వరకు పూర్తి చేసారు. ఓ వారం పది రోజులు వర్క్ చేస్తే అది పూర్తవుతుంది. హరిహర వీరమల్లు పార్ట్ వన్ గా చేసి వదలాలి అన్నా, పవన్ కొద్ది రోజులు కేటాయించాల్సి వుంటుంది.

అందువల్ల పవన్ పని విభజన ఎలా చేసుకుంటారో చూడాలి.