ఏకంగా ఒక జిల్లాను బాబాయ్ అబ్బాయ్ రాజకీయంగా శాసిస్తున్నారు. అధికారం అందలాలు వారికే దక్కాయి. రాజకీయాల్లో ఇలాంటి తమాషాలు ఎపుడో కానీ జరగవు. ఒక విధంగా ఇది అరుదైన రాజకీయ సన్నివేశం అని అంటున్నారు.
చంద్రబాబు తన మంత్రివర్గ విస్తరణలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళానికి ఒకే ఒక పదవి ఇచ్చారు. ఆ పదవి కాస్తా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడుకే ఇచ్చారు. దాంతో జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆశావహులు చాలా మంది క్యూ కట్టినా అందరికీ నిరాశ తప్పలేదు.
రాజకీయంగా చూస్తే అబ్బాయ్ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి కేబినెట్ ర్యాంక్ తో రెండు రోజుల క్రితమే దక్కింది. మోడీ మంత్రి వర్గ విస్తరణలో ఏపీ నుంచి పెద్ద పీట రామ్మోహన్ నాయుడుకు అలా లభించింది. దాంతో ఒకే ఇంట్లో రెండవ పదవి ఇవ్వరని బాబు శ్రీకాకుళం జిల్లాలో మంత్రి పదవులకు వేరే వారి పేర్లు పరిశీలిస్తారు అని అనుకున్నారు.
కానీ బాబు కూడా అచ్చెన్నాయుడుకే ఓటేశారు. అలా మోడీ బాబు ఇద్దరి మంత్రివర్గంలో అబ్బాయ్ బాబాయ్ చేరారు. కీలకంగా వారు ఉన్నారు. ఈ పరిణామంతో శ్రీకాకుళం జిల్లా అధికార రాజకీయం అంతా కింజరాపు కుటుంబాన్నే కట్టేసుకుని తిరుగుతోంది అని అంటున్నారు.
మంత్రి పదవుల కోసం రేసులో ఉన్న చాలా మందికి ఇది మింగుడుపడని పరిణామం గా ఉంది. అంతే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్లందరికీ ఈసారి చెక్ పెట్టేసిన చంద్రబాబు కేవలం అచ్చెన్నాయుడుకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. దాంతో సీనియర్లు కూడా అచ్చెన్న లక్ ని చూసి అచ్చెరువు చెందుతున్నారు. రానున్న కొన్నేళ్ళ పాటు శ్రీకాకుళం జిల్లా అధికార రాజకీయాలు అన్నీ బాబాయ్ అబ్బాయ్ లతోనే సాగుతాయని అంటున్నారు.