తమ్ముళ్ళు హ్యాపీయేనా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకే ఒక్క మంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారు. పాయకరావుపేటకు చెందిన వంగలపూడి అనితకు ఆ పదవి దక్కింది. ఉమ్మడి విశాఖలో మంత్రి పదవులు అంటే వినిపించే పేర్లు రెండే రెండు.…

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకే ఒక్క మంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారు. పాయకరావుపేటకు చెందిన వంగలపూడి అనితకు ఆ పదవి దక్కింది. ఉమ్మడి విశాఖలో మంత్రి పదవులు అంటే వినిపించే పేర్లు రెండే రెండు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అలాగే చింతకాయల అయ్యన్నపాత్రుడు.

ఈ ఇద్దరికీ చంద్రబాబు తన గత అయిదేళ్ళ ప్రభుత్వంలో పూర్తి కాలం మంత్రులుగా కొనసాగే అవకాశాన్ని ఇచ్చారు. ఈసారి కూడా ఈ ఇద్దరి ఇంటి గడపను దాటి మంత్రి పదవి ఎక్కడికీ పోదని అనుచరులు అభిమానులు బలంగానే నమ్మారు. కానీ ఈ ఇద్దరికీ షాక్ ఇచ్చేలా బాబు నిర్ణయం ఉంది.

దాంతో ఎందుకు ఇలా జరిగింది అని మాజీ మంత్రుల శిబిరాలలో తమ్ముళ్ళు తర్కించుకుంటున్నారు. ఈసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రి పదవుల విషయంలో పోటీ సామాన్యంగా లేదు. జనసేన నుంచి నలుగురికి టికెట్ ఇస్తే అందరూ గెలిచారు. అలా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనుకోకుండా రేసులోకి వచ్చారు.

మరో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు కూడా తప్పకుండా మంత్రులం అవుతామని నమ్మారు. ఇంకో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి కూడా మంత్రి పదవి మీద ఆశలు పెంచుకున్నారని అంటున్నారు. నాలుగు సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు కూడా మంత్రి కుర్చీ దక్కుతుందని ఒక దశలో అనుకున్నారు.

బీజేపీకి చెందిన విష్ణు కుమార్ రాజుకు మిత్రపక్షాల కోటాలో మంత్రి పదవి దక్కుతుందని కమలం పార్టీ నేతలు అంచనా వేసుకున్నారు. కానీ బాబు ఊహకందని నిర్ణయం తీసుకుని మొత్తం జిల్లాకు ఒకే ఒక్క పదవి అని నిర్ణయించారు. విశాఖ సిటీలో ఈసారి మంత్రి అన్నవారే లేకుండా పోయారు.

ఈ పరిణామాల పట్ల చర్చ ఒక వైపు సాగుతోంది. అయితే ఒకరికి మంత్రి పదవి దక్కలేదు అంటే బాధ కానీ రేసులో ఉన్న సీనియర్లు ఎవరికీ పదవులు లేవు. దాంతో మాకూ లేదూ అవతల వారికీ లేదు అని ఆయా నేతల అనుచరులు కొంతలో కొంత హ్యాపీ అవుతున్నారుట. ఈ విధంగా బాబు తన రాజకీయ చాతుర్యంతో వ్యవహరించారు అని అంటున్నారు.

ఒకరికి ఇచ్చి రెండవ వారికి ఇవ్వకపోతే చిక్కులు వస్తాయి. ఎవరికీ లేదు అంటే గొడవే లేదు అన్నదే బాబు అనుసరించిన విధానం అని అంటున్నారు.