భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఒక భాగం! ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కదా అని గతంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిపోతే ద్రోహం అవుతుంది! ఇది ప్రత్యేక హోదా గురించి చెబుతున్న మాట కాదు.
ప్రత్యేక హోదా అనే డిమాండ్ ను అందరూ కలిసి ఎప్పుడో చంపేశారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మరొకటి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం వారి చేతిలోనే ఉన్నది గనుక ఆ హామీని నెరవేర్చడంలో అడుగు ముందుకు వేస్తారో లేదో చూడాలి.
అమరావతిపై ప్రేమను విస్పష్టంగా ప్రకటించుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతానికి ఆయనకి ప్రజల ఆమోదం ఉంది గనుక ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు! అదే సమయంలో విశాఖపట్నం ను ఆర్థిక రాజధానిగా చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు పై ప్రత్యేక దృష్టి పెడతానని అంటున్నారు తప్ప- ఏం చేస్తారో స్పష్టత ఇవ్వడం లేదు. కానీ కర్నూలు కోసం భారతీయ జనతా పార్టీ ప్రకటించిన హామీ ఒకటి ఉంది.
తాము అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని బిజెపి చాలా కాలంగా ప్రకటిస్తోంది. రాయలసీమకు తాము చేస్తున్న అతి గొప్ప మేలు లాగా దానిని వారు పేర్కొన్నారు. మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంతో మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తెరమీదకి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ప్రధాన న్యాయమూర్తితో కూడిన హైకోర్టు బెంచి ఉంటుందని అన్నారు.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా భాగమైన ప్రభుత్వం కర్నూలుకు ఇచ్చిన హామీని ఏమేరకు నిలబెట్టుకుంటుంది? కనీసం ఎక్కడ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తారా లేదా? భారతీయ జనతా పార్టీకి తాము గతంలో ఇచ్చిన హామీ గుర్తుందా లేదా? అనే ప్రశ్నలు రాయలసీమ వాసుల నుంచి వినిపిస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా రాయలసీమకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ప్రత్యేక దృష్టి పెడతాం అంటున్నారు తప్ప- ఏమీ తేల్చి చెప్పడం లేదు. కానీ బిజెపి అయినా తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తాము భాగంగా ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుందా లేదా వేచి చూడాలి. వారు అలా చేయగలిగితే.. ప్రత్యేకహోదా ఇవ్వకుండా చేసిన వంచనను ప్రజలు కాస్త క్షమించే అవకాశం ఉంటుంది.