కీలక విషయాలపై బాబు నిర్ణయం ఏమిటో?

మరి కొద్ది సేపట్లో ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా కీలక విషయాల్లో ఆయన ఏం నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి సర్వత్రా వుంది. వాటిల్లో ముఖ్యమైనది లిక్కర్ పాలసీ.…

మరి కొద్ది సేపట్లో ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా కీలక విషయాల్లో ఆయన ఏం నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి సర్వత్రా వుంది. వాటిల్లో ముఖ్యమైనది లిక్కర్ పాలసీ.

ప్రస్తుతం లిక్కర్ దుకాణాలను ప్రభుత్వం నడుపుతోంది. లక్షకు పైగా చిరుద్యోగులు ఔట్ సోర్సింగ్ లెక్కన పని చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ లిక్కర్ దుకాణాలకు వేలం పాట పెట్టి, సిండికేట్ లకు అప్పగిస్తే వీరంతా రోడ్డున పడతారు. సరే, వీరి సంగతి అలా వదిలేస్తే, మళ్లీ బెల్ట్ షాప్ లు పురుడు పోసుకుంటాయి. ప్రయివేట్ ఆర్మీలు మొదలవుతాయి. ఇలా చాలా వుంటాయి వ్యవహారాలు.

విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ చాలా ఉపయోగకరంగా వుంది. వాటిని కానీ అలాగే రైతు భరోసా కేంద్రాలను కానీ చంద్రబాబు ఏం చేస్తారు? కొనసాగిస్తారా? పటిష్టం చేస్తారా? పక్కన పెడతారా? వీటిని పక్కన పెడితే ఇబ్బంది పడేది జనమే. అలాగే వాలంటీర్ వ్యవస్థ ను కొనసాగిస్తామని, పది వేలు జీతం చేస్తామని అన్నారు. అంటే ఇంటికే పింఛను పంపిణీ వంటివి కొనసాగుతాయనే అనుకోవాలి. అయితే వాలంటీర్ల నియామక వ్యవస్థ ను ఏ విధంగా కొనసాగిస్తారో చూడాలి.

ఇసుక పాలసీ అన్నది జగన్ కు బాగా బ్యాడ్ నేమ్ తెచ్చింది. మళ్లీ పాత పాలసీ తెస్తారా? మళ్లీ ఇసుక ర్యాంప్ లు. డే అండ్ నైట్ మెషీన్ తవ్వకాలు మొదలవుతాయేమో? కానీ అలా అయితే పార్టీ జనాలు బాగుపడతారు. జనాలకు ఒరిగేది మాత్రం ఏమీ వుండదు.

కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేసారు జగన్. వాటిని కొనసాగించాల్సిందే. ఎటొచ్చీ సరిహద్దులు ఏమన్నా మరుతాయా, పేర్లు ఏమైనా పెడతారా? అన్నది అనుమానమే.

మొత్తం మీద జగన్ తీసుకున్న నిర్ణయాలను చాలా వరకు తిరగతోడే అవకాశం వుంది. అయితే ప్రజలకు ఉపయోగపడేవి అలాగే వుంచుతారా? తీసుకునే నిర్ణయాలు బాగానే వుంటాయా? అన్నది చూడాలి.