చంద్రబాబునాయుడి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుంది. బాబు కొత్త కేబినెట్‌పై స్పష్టత వచ్చింది. టీడీపీ 21, జనసేన 3, బీజేపీకి ఒకటి చొప్పున కేబినెట్‌లో బెర్త్‌లు ఖరారయ్యాయి. సీఎంగా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌కు ఇచ్చే మంత్రిత్వ శాఖపై విస్తృత చర్చ జరుగుతోంది.
పవన్‌కు హోంశాఖ ఇస్తారనే ప్రచారాన్ని జనసేన చేస్తోంది. అయితే పవన్‌కు ఆ మంత్రిత్వ శాఖను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని చంద్రబాబుపై టీడీపీ ముఖ్య నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఇంకా మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించకుండానే, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పడం తన కర్తవ్యంగా పవన్ చెప్పడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారం వచ్చిన నేపథ్యంలో వైసీపీపై కక్ష తీర్చుకోవాలని టీడీపీ నేతలు తహతహలాడుతుంటే, అందుకు విరుద్ధంగా పవన్‌కల్యాణ్ శాంతి వచనాలు పలకడం ఏంటని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. పవన్‌కు హోంశాఖ ఇస్తే, ఇక రాష్ట్రంలో టీడీపీ కోరుకుంటున్నట్టు ఏదీ జరగదనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పవన్‌కల్యాణ్‌ను చంద్రబాబు నియంత్రించలేరని, పోలీస్‌శాఖను జనసేనాని గుప్పిట్లోకి తెచ్చుకుని, అజమాయిషీ చెలాయిస్తారని టీడీపీ నేతలు భయపడుతున్నారు.
పోలీస్‌శాఖపై టీడీపీ పట్టు లేకపోతే, వైసీసీని ఏమీ చేయలేమనే ఆందోళన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. పవన్‌కల్యాణ్‌కు హోంశాఖ ఇస్తే మాత్రం… కక్ష, ప్రతీకార చర్యలను ప్రోత్సహించకపోగా, అడ్డుకుంటారని, అప్పుడు రాజకీయంగా తమకు నష్టం వస్తుందని బాబుకు టీడీపీ నేతలు చెబుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పవన్‌కు కేటాయించే మంత్రిత్వశాఖపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒత్తిళ్లకు తలొగ్గి పవన్‌కు అప్రాధాన్య మంత్రిత్వశాఖను కేటాయిస్తారా? లేక హోంశాఖ కేటాయించి, స్వేచ్ఛనిస్తారా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.