ఏపీకి ఎగరని విమానం

మంత్రి పదవులు కేంద్రంలో దక్కాయని చంకలు గుద్దుకున్నంతసేపు పట్టలేదు. మంత్రిత్వ శాఖలతో బీజేపీ పెద్దలు వడ్డించిన విస్తరిలో ఏమున్నాయో తేలిపోయింది. ఏపీకి ఒకే ఒక్క కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా వెనకబడిన…

మంత్రి పదవులు కేంద్రంలో దక్కాయని చంకలు గుద్దుకున్నంతసేపు పట్టలేదు. మంత్రిత్వ శాఖలతో బీజేపీ పెద్దలు వడ్డించిన విస్తరిలో ఏమున్నాయో తేలిపోయింది. ఏపీకి ఒకే ఒక్క కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా వెనకబడిన ఉత్తరాంధ్రకు ఇచ్చారు. మంచి శాఖ ఇస్తే ఎంతో కొంత అభివృద్ధి సాగుతుందని అంతా ఆలోచించారు.

కానీ ఏపీకి విమానయాన శాఖ ఇచ్చారు. ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉందని అంతా విమర్శిస్తున్నారు ఈ శాఖ సంపన్నులకు మాత్రమే ఉపయోగపడేదని ఎర్ర బస్సు ఎక్కేవారు నూటికి తొంబై శాతం పైగా ఉన్న ఏపీలో ఎయిర్ బస్సు డ్రైవింగ్ చేయమని ఇస్తే ఎలా అని ప్రజా సంఘాలు మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఆది నుంచి ఏపీ మీద బీజేపీ పెద్దలకు చిన్న చూపే అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏపీకి నిధులు తెచ్చే శాఖ ఏదైనా ఇస్తే ప్రగతి దారులు వెతుక్కునే వారమని అంటున్నారు. అలా కాకుండా ఇచ్చామంటే ఇచ్చామని చెప్పుకోవడానికేనా ఈ శాఖ అని పెదవి విరుస్తున్నారు.

దేశంలో ఇప్పటికే విమాన యాన శాఖలో ప్రైవేటీకరణ జరుగుతోంది. ఏపీలో చూస్తే ఈ శాఖ వల్ల ఏమి లాభం ఒనగూడేనూ అంటే జవాబు శూన్యమే అంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం 2025 నాటికి తొలి దశ పూర్తి అవుతుందని ఆ మేరకు ఏమైనా ఉపయోగపడితే మేలే అంటున్నారు.

మొత్తంగా చూసుకుంటే విమానయాన శాఖ వల్ల నిధులు దక్కేది సున్నా అని అంటున్నారు. ఏ రైల్వే శాఖనో భారీ పరిశ్రమల శాఖనో లేక గ్రామీణాభివృద్ధి వ్యవసాయం వంటి శాఖలు ఇచ్చినా ఏపీకి భారీగా లబ్ది చేకూరేదని అంటున్నారు.

ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ ఊసు లేదు, విశాఖ ఉక్కు ఉరికంబం ఎక్కించారు. ఇపుడు విమానయాన శాఖ అంటున్నారు. ఎగరని విమానంతో ఎంత ప్రయత్నం చేసినా సుఖమేంటని అంటున్నారు. అయితే తనకు ఇచ్చిన శాఖ పట్ల రామ్మోహన్ నాయుడు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

యువకుడివి విదేశాలు తిరిగావు, పెద్ద చదువులు చదివావు అందుకే ఈ శాఖ నీకు ఇస్తున్నానని ప్రధాని మోడీ చెప్పి మరీ ఇచ్చారని ఆయన అంటున్నారు. ఈ శాఖతో దేశమంతా విమాన యాన రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన చెబుతున్నారు.