బాబుని వదలనంటున్న పాల్

కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ అధినేతగా ఆయన విజయాలు సాధించకపోవచ్చు కానీ రాజకీయ నేతలను చెడుగుడు ఆడడంతో మాత్రం పొలిటికల్ గా పీహెచ్‌డీ నే చేశారు. ఆయన రాజకీయంగా రాటు దేలారు. పదునైన…

కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ అధినేతగా ఆయన విజయాలు సాధించకపోవచ్చు కానీ రాజకీయ నేతలను చెడుగుడు ఆడడంతో మాత్రం పొలిటికల్ గా పీహెచ్‌డీ నే చేశారు. ఆయన రాజకీయంగా రాటు దేలారు. పదునైన విమర్శలు చేస్తూ అసలైన ప్రజా పక్షంగా ఉంటున్నారు.

చంద్రబాబు విషయంలో అయితే పాల్ గట్టిగానే తగులుకుంటున్నారు. మోడీ ప్రభుత్వానికి కండిషన్లు పెట్టి మద్దతు ఇవ్వాల్సిన బాబు మంచి అవకాశాలను పోగొట్టుకున్నారని అంటూ వీడియో బైట్స్ వదులుతున్నారు. పాల్ అందులో చెబుతున్న మాటలు బాబుని నిలదీస్తున్న వైనం మేధావులు ప్రజా సంఘాల నేతలను ఆకట్టుకుంటున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగింపు అన్న హామీలను తీసుకుని బాబు ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చి ఉండాల్సింది అని పాల్ అంటున్నారు. కానీ బేషరతుగా బాబు మోడీకి మద్దతు ఇచ్చేశారు అని ఆ విధంగా ఏపీకి తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఫైర్ అయ్యారు.

కేంద్ర మంత్రి పదవుల కంటే కూడా ఏపీకి విభజన హామీలు ప్రత్యేక హోదా ముఖ్యమని పాల్ బల్ల గుద్ది మరీ చెప్పడం అందరినీ నచ్చేదే అవుతోంది. ప్రత్యేక హోదా వస్తే ఏపీకి పరిశ్రమలు వస్తాయని యువతకు ఉద్యోగాలు దక్కుతాయని ఏపీ అభివృద్ధి బాటన సాగుతుందని ఆయన వివరిస్తున్న తీరూ మన్ననలు అందుకుంటోంది

ప్రత్యేక హోదా తేకుండా ఏపీని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పాలని పాల్ నిలదీస్తున్నారు పది లక్షలకు పైగా అప్పులతో ఉన్న ఏపీని బాబు ఏమి చేసి అభివృద్ధి చేయగలుగుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి సీట్లు తగ్గాయి ఇది ఏపీకి సువర్ణ అవకాశం అని దానిని బాబు వాడుకోకుండా ఉంటే మాత్రం ఏపీకే శాపంగా మారుతుందని పాల్ హెచ్చరించడమూ గమనార్హం. ఏపీ కోసం ఆలోచించమని పాల్ బాబుని కోరుతున్నారు.