ఏపీలో వైసీపీ ఓటమి చెంది వారం రోజులు గడిచాయి. ఈ వారం వైసీపీకి పెను భారంగానే సాగిందంటే అతిశయోక్తి లేదు. ఎంతో ఊహించుకుని ఏమీ కాకుండా పాతాళానికి జారిపోవడం అంటే అది షాకులకే బాప్ అని అనుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికల్లో భారీ ఓటమితో గట్టి ఎదురుదెబ్బ తగిలినా వైసీపీ అధినేత జగన్ వెంటనే తేరుకున్నారు. వరసబెట్టి రివ్యూస్ చేస్తున్నారు. ప్రతీ రోజూ ఆయనను వివిధ జిల్లాల నుంచి నేతలు వచ్చి కలుస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అలా కలసి వస్తున్న నేతలు సంగతి అటుంచి కలవని నేతల విషయంలోనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
ఓడిపోయిన నేతలు సైలెంట్ అయ్యారు. ఎటూ పార్టీ ఓడింది కాబట్టి రెగ్యులర్ యాక్టివిటీ అయితే ఆగింది. మరి వారు ఏమి చేస్తున్నారు అన్నదే చర్చగా సాగుతోందిట. నిన్నటి దాకా అధికారంలో ఉంటూ పదవులు అనుభవించిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు అయితే పక్క పార్టీల వైపు చూస్తున్నారు అని టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
అందుకే వారు ముఖం చాటేస్తున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. టీడీపీ జనసేనల మీద పెద్ద గొంతుకలతో విమర్శలు చేసిన నాయకులు కూడా ఇపుడు గొంతుక సవరించుకుంటున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయిదేళ్ళు విపక్షమా వామ్మో అని అనుకుంటున్న వారు కొందరైతే తమ మీద ఎక్కడ అధికార పక్షం కేసులు పెట్టి టార్గెట్ చేస్తుందో అన్న భయంతో కలవరంతో మరికొందరు ఉన్నారుట.
వీరంతా సేఫ్ జోన్ ఏది అని వెతుక్కుని మరీ షెల్టర్ పొందాలని చూస్తున్నారుట. ఉత్తరాంధ్ర జిల్లాలలో అయితే కొందరు నేతలు ఇక రాజకీయాలు చాలు అని విరామం ప్రకటించే ఆలోచనలో ఉన్నారుట. వారి మీద ఎలాంటి కేసులూ పెట్టే చాన్స్ లేదు కాబట్టి అది వారి ఇష్టం. కానీ కేసులు పడతాయన్న వారు టార్గెట్ అవుతామన్న వారు మాత్రం కొత్త దారులేవీ అని వెతికే పనిలో ఉన్నారుట.
ఇదిలా ఉంటే ఈ నెల 13, 14 తేదీలలో వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో భారీ ఎత్తున పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం పార్టీ తరఫున పోటీ చేసిన వారిని అందరినీ పిలుస్తున్నారు. అపుడు కూడా ఎవరైనా వెళ్ళకుండా వెనకడుగు వేస్తే మాత్రం ఎవరెవరి రాజకీయ రంగులేంటి అన్నవి స్పష్టంగా తేలిపోతుంది అని అంటున్నారు.