2024 ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఆరు నెలలు వుంది. ఈ ఆరు నెలలకు సరిపడా భారీ సినిమాలు వుండనే వున్నాయి. కల్కి దగ్గర మొదలై పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్ మీదుగా ఇంకా అనేక సినిమాలు విడుదలకు రెడీగా వున్నాయి. అందుకే ఇక అందరి దృష్టి రాబోయే సంక్రాంతి మీద పడింది.
2024 సంక్రాంతికి జరిగిన గడబిడ చూసి, అందరూ ముందుగానే రుమాళ్లు వేస్తున్నారు. 2024 సంక్రాంతి టైమ్ లోనే పేరు.. వివరాలు లేకుండా 2025 సంక్రాంతి తమ సినిమా వస్తుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించేసారు. తమ బ్యానర్ లో ఏదో ఒక సినిమా వుంటుంది అనే ధీమా కావచ్చు. అనిల్ రావిపూడి- వెంకీ సినిమా జూలై లో ప్రారంభం అవుతుంది. బహుశా అదే దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే సంక్రాంతి సినిమా.
మెగాస్టార్-యువి బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా ఆల్ మోస్ట్ పూర్తి కావొచ్చింది. సిజి వర్క్ లు ఎక్కువ వుంటాయి. అందువల్ల జాగ్రత్తగా అవన్నీ పూర్తి చేసుకుని సంక్రాంతికి 2025 కు వస్తారు. సంక్రాంతి సినిమాల్లో భారీ సినిమా అదే కావచ్చు.
లేటెస్ట్ గా మరో సినిమాను సంక్రాంతికి అంటూ ప్రకటించారు. సితార సంస్థ రవితేజ-శ్రీలీల కాంబినేషన్ లో నిర్మించే సినిమాకు ముహుర్తం చేస్తూనే సంక్రాంతి విడుదల అంటూ ప్రకటించేసారు. రవితేజ తన సినిమాల స్పీడ్ కానే ఫినిష్ చేస్తారు. అందువల్ల ఆ సినిమా సంక్రాంతికి రెడీ అయిపోతుంది.
పీపుల్స్ మీడియా- తేజు సజ్జా మిరాయి సినిమా సంక్రాంతికి అని ప్రకటించారు. కానీ మెగాస్టార్ సినిమా వుంది కనుక వస్తుందా అన్నది అనుమానం. ఎందుకంటే పీపుల్స్ మీడియాకు, మెగాస్టార్ కు మంచి స్నేహ సంబంధాలు వున్నాయి కనుక.
అందువల్ల ప్రస్తుతానికి అయితే మూడు సినిమాలు ఫిక్స్ 2025 సంక్రాంతికి. ఇంక ఆ టైమ్ ఏ సినిమాలు వచ్చి పడతాయో చూడాలి.
కొసమెరుపు ఏమిటంటే డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ వస్తుందనే టాక్ వుంది. అంత వరకు రావడానికి అవకాశం లేదు అని. కానీ ఏమాత్రం వెనక్కు వెళ్లినా, మెగాస్టార్, మెగాపవర్ స్టార్ సినిమాలు సంక్రాంతికి ఢీ కొనే అవకాశం వుంటుందా? నో ఛాన్స్ అనుకోవచ్చేమో?