సినిమాల్లో సంగీతానికి ఎప్పుడూ ప్రాధాన్యత వుంటుంది. మంచి పాటలు వుంటే ఆ లెక్క వేరు. పాటల కారణంగా బ్లాక్ బస్టర్లు అయిన సినిమాల జాబితా చాలా అంటే చాలా పెద్దదే. ఇప్పుడు సినిమాలకు జనాలు రావడం తగ్గింది. ఇలాంటి టైమ్ లో మంచి వైరల్ పాట ఒక్కటి వున్నా దాని ప్రభావం వేరుగా వుంటోంది. సినిమాకు ఓపెనింగ్ రాబట్టడంలో పాటల ప్రభావం చాలా వుంటోంది ఇప్పుడు. దీనికి తోడు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లకు బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ప్రాధాన్యత పెరిగింది. దీంతో ఎక్కడెక్కడి సంగీత దర్శకులను వెదికి తెస్తున్నారు. దానికి తగినట్లే రెమ్యూనిరేషన్లు పెరుగుతున్నాయి.
సంగీత దర్శకులు కూడా క్వాలిటీ కోసం, కొత్త కొత్త గొంతుకలు వినిపించడం కోసం తమకు అందుతున్న ప్యాకేజ్ డీల్ నుంచి పెద్ద మొత్తాలు ఖర్చు చేస్తున్నారు. దాంతో ఈ రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరక్టర్ల రెమ్యూనిరేషన్ ఆరేడు కోట్ల నుంచి పది కోట్లకు చేరిపోయింది. అనిరుధ్, దేవీశ్రీప్రసాద్, థమన్ ఇలా టాప్ లైన్ లో చాలా మందే వున్నారు. వీరందరూ కూడా ఆరేడు కోట్ల నుంచి 10 కోట్లు కోట్ చేస్తున్నారు. ఒకటి రెండు హిట్ లు ఇచ్చిన చిన్న, మీడియం మ్యూజిక్ డైరక్టర్లు కూడా రెండు కోట్లు, ఆపైన డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ కోట్ రకరకాలుగా వుంటుంది. విత్ సింగర్స్ రెమ్యూనిరేషన్, వితవుట్ సింగర్స్ రెమ్యూనిరేషన్ అనేది ఒకటి. ఎందుకంటే కొంత మంది సింగర్స్ భారీగా రెమ్యూనిరేషన్ తీసుకుంటారు. వాళ్లతో ఒకటి అయినా పాడించాలి అంటే నిర్మాత అదనపు ఖర్చు భరించాల్సి వుంటుంది. అయితే ఇక్కడ లక్ ఏమిటంటే సినిమాల అడియో రైట్స్ కూడా భారీగా పెరిగాయి. ఆ రేట్లతో పోల్చుకుంటే ఈ పది కోట్లు పెద్ద ఎక్కువ కాదు. పాతిక కోట్లు అడియో రైట్స్ మీద వస్తుంటే పది కోట్లు ఖర్చు చేయడం అన్నది పెద్ద విషయం కాదు.
ఇదిలా వుంటే చిరకాలంగా థమన్, దేవీ లతో పని చేస్తూ, మంచి పాటలు చేయించుకున్న దర్శకులు కూడా ఇప్పుడు వేరే వైపు మొగ్గు చూపుతున్నారట. ఎందుకంటే సినిమా బడ్జెట్ కనీసం అయిదు కోట్లు తేడా వస్తుందని. చాలా మంది దర్శకులు రిఫరెన్స్ ఇచ్చి ట్యూన్ లు చేయించుకుంటారు. ఫలానా పాట మాదిరిగా, ఫలానా స్టయిల్ మాదిరిగా, ఈ విధంగా అన్నమాట. అవన్నీ తామే ఇస్తున్నపుడు ఇంతంత రెమ్యూనిరేషన్ ఎందుకు అనే ఆలోచనలు కూడా చేస్తున్నారట.