Advertisement

Advertisement


Home > Politics - Opinion

టిటిడి ఈవో ధర్మారెడ్డి ఎందుకంత వివాదాస్పదమయ్యారు?

టిటిడి ఈవో ధర్మారెడ్డి ఎందుకంత వివాదాస్పదమయ్యారు?

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్న ఎ.వి.ధర్మారెడ్డిపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం దిగిపోయాక ఆయనపైన టిడిపి, జనసేన, భార‌తీయ జ‌న‌తా పార్టీలు మండిపడుతున్నాయి.

టిటిడిలో ధర్మారెడ్డి వ్యవహారాలపైన విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆయన విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేయాలని కూడా ఆ పార్టీల నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ధర్మారెడ్డి సెలవు పెట్టారు. వారం రోజులు సెలవు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఈ కాలంలో రాష్ట్రంలోనే అందుబాటులో వుండాలని షరతు విధించింది.

ఇంతకీ ధర్మారెడ్డి ఎందుకంత వివాదాస్పదమయ్యారు? ఇంతమంది ఆయనపైన ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? గతంలో ఓఎస్‌డిగా పని చేసినపుడు కూడా ధర్మారెడ్డి అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరికి అప్పుడు ఆయన కన్నీటిపర్యంతంగా తిరుమలను విడిచి వెళ్లారు.

వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ధర్మారెడ్డి తిరుమల ఓఎస్‌డిగా నియమితులయ్యారు. గత అనుభవాల కారణంగా టిటిడి ఉద్యోగులు, అధికారులు ధర్మారెడ్డి పేరు వినగానే హడలెత్తిపోయారు. అయినా.. ఆయన వ్యవహార శైలి మారి వుంటుందన్న ఆశ పెట్టుకున్నారు.

ఆయన మారలేదని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇంకా చెప్పాలంటే మరింత నియంతృత్వ పోకడలతో పని చేయడం మొదలుపెట్టారు.

టిటిడి మొత్తం భ్రష్టుపట్టిపోయిందని, తాను మాత్రమే దాన్ని బాగుచేయగలనన్న ఒక పొరపాటు భావనతోనే ధర్మారెడ్డి తిరుమలలో అడుగుపెట్టారు.

తన ప్రతాపాన్ని చూపడం మీడియాతో మొదలుపెట్టారు. ‘తిరుమలలో ఇంతమంది మీడియా ప్రతినిధులేమిటి? ఎవరు వీరంతా.. ఎందుకొస్తున్నారు తిరుమలకు...’ అంటూ తాను చెప్పిన వారే విలేకరులు అనే రీతిగా ఒక జాబితా తయారు చేశారు. టిటిడి కార్యక్రమాలకుగానీ, ప్రెస్‌మీట్లకుగానీ ఆ జాబితాలోని విలేకరులను మాత్రమే ఆహ్వానించాలంటూ టిటిడి సమాచార విభాగానికి హుకుం జారీ చేశారు. తమిళ మీడియా ప్రతినిధులు ఆ జాబితాలో లేకపోతే.. తమిళనాడు ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆయనతో చెప్పించుకుని తమ పేర్లను ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వచ్చింది.

తిరుమల అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. సహజంగానే ఇక్కడి విశేషాలకు మీడియాలో అత్యంత ప్రాధాన్యత వుంటుంది. అందుకే మీడియా ప్రతినిధులు కూడా ఎక్కువగా వుంటారు. అందరూ దర్శనాల కోసమే వస్తున్నట్లు భావించి తాను అనుకున్న పత్రికలు, టివి చానళ్లతోనే జాబితా తయారు చేయించి, మిగతా వారిని తిరుమల నుంచి గెంటేశారు. అక్కడే ఆయన నియంతృత్వ పోకడలకు బీజం పడిరది.

ఇక టిటిడి ఆదాయాన్ని పెంచడానికే తనను తిరుమలకు పంపించారనేలా వ్యవహరించారు. ‘సాధారణ భక్తుల వల్ల ఆదాయం ఏమొస్తుంది.. బ్రేక్‌ దర్శనాల సమయంలోనే హుండీ నిండేది’ అని బహిరంగంగానే ఆయన వ్యాఖ్యానించేవారు. అందుకు తగ్గట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఆదాయం పెంచే ఆలోచన నుంచి వచ్చిందే...‘శ్రీవాణి’ దర్శనం. రూ.10 వేలు విరాళంగా ఇస్తే బ్రేక్‌ దర్శనం ఇస్తామంటూ పథకాన్ని ప్రవేశపెట్టి.. రోజూ వేలాది టికెట్లు అమ్మడం మొదలుపెట్టారు. ఫలితంగా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం దుర్లభంగా మారింది. భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో అనంతర కాలంలో శ్రీవాణి టికెట్ల సంఖ్య తగ్గించారు.

టిటిడి ఖర్చులు తగ్గించే పేరుతో ధర్మారెడ్డి చేసిన ఇంకో పాపం కూడా వుంది. అదేమంటే.. భక్తులకు క్యూకాంప్లెక్స్‌లలో సరైన తిండి పెట్టకపోవడం. తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం ఇబ్బందిపడొచ్చుగానీ.. తిండికి ఇబ్బంది పడిన ఉదంతాలు లేవు. రోడ్లుపైన ఉన్నా, క్యూలో వున్నా అన్నపానీయాలకు కొదవ వుండేది కాదు. ఈయన వచ్చిన తరువాత క్యూలైన్లలో అన్నం కోసం, చంటిబిడ్డల పాల కోసం అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. దానిపైన అనేక కథనాలు వచ్చినా ఆయన తీరులో మార్పు రాలేదు.

దేశంలో పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో భక్తులు తిండికి కూడా డబ్బులు లేక అవస్థపడుతుంటే.. అప్పటి ఈవో సాంబశివరావు అప్పటికప్పుడు రోడ్లపై ఉచిత అన్న వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయించారు. దీంతో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. ఎక్కడికెళ్లినా రోడ్డు మీదే తిండి లభించే పరిస్థితి వుండేది. ఇక క్యూకాంప్లెక్స్‌లోనైతే.. భక్తులు క్యూలో వున్నంత సేపు ఏదో ఒక ఆహారం అందించేవారు. ఆఖరికి చిన్నపిల్లలను దృష్టిలో వుంచుకుని...పాలు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ చెల్లుచీటీ రాసేశారు ధర్మారెడ్డి.

దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులు టిటిడికి శాపనార్ధాలు పెట్టేవారు. గంటల కొద్దీ క్యూలో బందించి అన్నపానీయాలు కూడా ఇవ్వకపోతే ఎలా అంటూ మండిపడేవారు. ఇవన్నీ పత్రికల్లోనూ, టివీల్లోనూ వచ్చాయి. అయినా ఆయన పట్టించుకోలేదు. ఎంత డబ్బులు మిగిలాయో లెక్కలేసుకున్నారు.

ఆఖరికి.. భక్తులకు పెట్టే తిండి ఖర్చులు తగ్గించుకోవడం కోసం టోకెన్‌ లేకుండా కొండ ఎక్కనీకుండా చేయడానికి ప్రయత్నించారు. ఇది వివాదాస్పదం కావడంతో విరమించుకున్నారు.

ఇవి కాకుండా.. టిటిడిలోని లోపాలపై విమర్శలు చేసేవారిపైన ఉక్కుపాదంతో విరుచుకుపడ్డారు. సదుద్దేశంతో, భక్తులకు సదుపాయాలు క‌ల్పించే దృష్టితో చేసిన విమర్శలను కూడా సహించలేక కేసులు పెట్టడానికి పూనుకున్నారు. తిరుపతికి చెందిన ఓ శ్రీవారి భక్తుడిపై మూడు కేసులు బనాయించారు. దుష్ప్రచారం చేసేవారిపై కేసులు పెట్టొచ్చుగానీ..టిటిడిని ఎంతగానో ప్రేమించే వారిపైన కేసులు పెట్టడమే అభ్యంతరకరం.

ఇవికాకుండా.. ఉద్యోగ కార్మికుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించారు. ఆందోళన మాటెత్తితేనే ఆయన ఉడికిపోయారు. ఉద్యోగ సంఘాల నాయకులను సస్పెండ్‌ చేసే దాకా వెళ్లారు. అధికారులను, అర్చకులను ఏకవచనంతో మాట్లాడటం, బెదిరించడం వంటివి నిత్యకృత్యం. ఆ మధ్య ఒక ఉద్యోగి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణంగా ధర్మారెడ్డి అనే ఆరోపణలున్నా.. ఎవరూ నోరెత్త‌లేక‌పోయారు.

ధర్మారెడ్డి తాను సమర్ధ అధికారినని తనకు తాను  భావిస్తుంటారు. అయితే అత్యంత విఫల అధికారిగా భక్తులు ఆయన్ను చూస్తున్నారు. ఆయన ఈవోగా వచ్చేకే తిరుమలలో కిలోమీటర్ల కొద్దీ లైన్లు కనిపిస్తున్నాయి. ధర్మారెడ్డి ఈవోగా రాక మునుపు క్యూలైను బయటకు రావాల్సిన అవసరం లేని విధంగా దర్శన విధానాన్ని అమలు చేశారు. పాత పద్ధతులను తీసేసిన ఫలితంగానే ఇప్పుడు శ్రీవారి ఆలయం నుంచి శిలాతోరణం దాకా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్యం విషయమూ అంతే...ఆధ్వానంగా తయారయిందని భక్తులు పలుసార్లు విమర్శలు చేస్తూనే వున్నారు. ధర్మారెడ్డి తాను ఈవోగా రాకమునుపు ఎన్ని రోజులు క్యూలైన్ల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ దాటి బయటకు వచ్చాయో లెక్కలు తీశారా? భక్తుల అవస్థలకు ధర్మారెడ్డిది బాధ్యత కాదా?

బ్రేక్‌ దర్శనాల టికెట్ల జారీలో తానే రాజు తానే మంత్రిలాగా వ్యవహరించారు. ఈ విషయంలో అప్పటి అధికార పార్టీ నేతల పట్ల కూడా చాలా అమర్యాదగా ప్రవర్తించారన్న ఆరోపణలున్నాయి. మంత్రులు ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వకపోవడం, నిర్లక్ష్యంగా బదులివ్వడం వంటివి అనేక పర్యాయాలు చోటు చేసుకున్నాయి. ధర్మారెడ్డి తీరుపై వైసిపి నేతలు అప్పట్లో జగన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తనకు నేరుగా ముఖ్యమంత్రితోనే సంబంధాలున్నాయన్న ధీమాతోనే ఇష్టారాజ్యంగా వ్యహరించారన్న ఆరోపణలున్నాయి. అందుకే ఆయనపైన ఇప్పుడు తీవ్రస్థాయిలో దాడి జరుగుతున్నా అయ్యో పాపం అనేవారు కరువయ్యారు.

టిటిడి విరాళాలు ఇచ్చేవారిలో సింహ‌భాగం అన్నదానానికి ఇస్తారు. భక్తులకు అదొక సెంటమెంటు. కానీ ధర్మారెడ్డి వచ్చాక.. విరాళాలను ఎస్‌విబిసికి మళ్లించారు. ఎవరైనా అన్నదానానికి విరాళాలు ఇవ్వాలని వస్తే.. వొద్దు ఎస్‌విబిసికి ఇవ్వండంటూ అటువైపు మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఎస్‌విబిసికి ఇవ్వడం వేరు.. అన్నదానానికి విరాళం ఇవ్వడం వేరు. అయినా విధిలేక ధర్మారెడ్డి చెప్పినట్లు విరాళాలు ఇచ్చారు. ఎస్‌విబిసిని తాను ఉద్ధరించానని చెప్పుకోడానికి ఇలా చేశారు. ధర్మారెడ్డి ఉన్నకాలంలో అన్నదానానికి ఏ స్థాయిలో విరాళాలు తగ్గిపోయాయో లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ఎస్‌విబిసిని కూడా ఆయన దుర్వినియోగం చేశారు. లైవ్‌లో తానే ప్రవచనాలు, సందేశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందుకు ఆయనకున్న అర్హత ఏమిటో తెలియదు.

తిరుమలకు ఎవరూ రాకూడదని భావించే ఆయన.. తన విషయంలో మాత్రం అన్నీ తనకే కావాలనే రీతిగా వ్యవహరించారు. మొదట్లో తిరుమల ఓఎస్‌డిగా వచ్చారు. ఆ పదం ఆయనకు నచ్చలేదు. అదనపు ఈవోగా హోదా మార్చుకున్నారు. ఆ తరువాత ఈవో పోస్టు ఖాళీ అయితే ఇన్‌ఛార్జిగా కొంతకాలం కొనసాగారు. ఆపై తనే ఈవోగా ఫుల్‌ అడిషనల్‌ ఛార్జ్‌గా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇంకా టిటిడికి సంబంధించిన పలు పదవులను ఆయన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇంకొకరిని తిరుమల కొండపైన అడుగుపెట్టనీకుండా అన్నీ తానై పాలించారు.  

ధర్మారెడ్డి తీరువల్లే తిరుపతిలో వైసిపి ఓటమిపాలయిందని చెబుతున్నవారు లేకపోలేదు. ఛైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి టిటిడి కార్మికుల జీతాలు పెంచినా, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా అవన్నీ మురికిలో పోసిన పన్నీరు అవడానికి ధర్మారెడ్డే కారణం అని చెబుతున్నారు. ధర్మారెడ్డి నియంతృత్వ పోకడలతో ఒక రోజు కూడా ఆయన్ను భరించలేని పరిస్థితి నెలకొన్నా.. ఆయన మాత్రం ఈసారి మా ప్రభుత్వమే వస్తుంది.. నేను రిటైర్‌ అయినా ఛైర్మన్‌గా మళ్లీ వస్తే..ఇక్కడే మరో ఐదేళ్లు వుంటా.. అంటూ బెదిరిస్తూ వచ్చారు. ఇది విపరీతంగా ప్రచారమయింది. దానివల్లే టిటిడి ఉద్యోగ కార్మికులు వైసిపికి వ్యతిరేకంగా ఓటు వేశారని చెబుతున్నారు.

గతంలో ఓఎస్‌డిగా పనిచేసిన సమయంలో తీవ్ర వివాదాస్పదమై కన్నీరు మున్నీరవుతూ తిరుమలను విడిచిపెట్టారు. రెండోసారి టిటిడికి వచ్చిన సందర్భంలోనైనా ధర్మారెడ్డి సౌమ్యంగా వుంటారని అందరూ ఆశించారు. అయినా ఆయన తీరులో మార్పులేదు. మరింత కఠినంగా, నియంతృత్వంగా పని చేశారు. అందుకే అప్పటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దు:ఖంతో, అవమానంతో తిరుమలను వీడాల్సి వస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

- ఆదిమూలం శేఖర్‌, జర్నలిస్టు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?