టీడీపీ, జనసేన నాయకులు బాగా ఆకలిపై ఉన్నారు. ఆకలి అంటే భోజనానికి సంబంధించిన వ్యవహారం కాదు. డబ్బు సంపాదించేందుకు అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని టీడీపీ, జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు. అధికారం అండ వుంటే, అప్పనంగా డబ్బు సంపాదించొచ్చనే అభిప్రాయమే వారి ఆకలికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఐదేళ్లుగా టీడీపీ, జనసేన నాయకులు అధికారానికి దూరంగా వుంటున్నారు.
ఇప్పుడు అధికారం దక్కింది. దీంతో ఆర్థిక వనరులపై టీడీపీ, జనసేన నాయకులు దృష్టి సారిస్తున్నారు. తమకు అనుకూలమైన రెవెన్యూ, పోలీస్ అధికారుల్ని నియమించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా కూటమి ప్రభుత్వం కొలువుదీరితే ఆ తర్వాత సంపాదనలో పడొచ్చనే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. తమ అనుకూల ఎమ్మెల్యేలకు దక్కే మంత్రి పదవులను బట్టి కూడా సంపాదన మార్గాలను ఎంచుకోవచ్చనే చర్చకు తెరలేచింది.
ఇప్పటికే తమకు అనుభవం ఉన్న వ్యాపారాలకు సంబంధించి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో అనే ఆరాలు మొదలయ్యాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే సంపాదించొచ్చని టీడీపీ, జనసేన నాయకులు ఆలోచిస్తున్నారు. వైసీపీ చేస్తున్న వ్యాపారాలపై కూడా టీడీపీ, జనసేన నాయకులు కన్నేశారు. ప్రభుత్వానికి సంబంధం వుంటే, వాటిని లాక్కోడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఇందులో నీతి, నియమాలు వంటివి అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అధికారం దక్కింది, ఇప్పుడు కాకపోతే సంపాదన మరెప్పుడు? అని వారి ప్రశ్న. ఈ క్రమంలో చేయరాని తప్పుల్ని కూడా చేయడానికి వెనుకాడడం లేదనే చర్చ జరుగుతోంది.