ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాల ధ్వంసం, అలాగే ఆయన పేరు చెరిపివేత, సచివాలయాలపై వైఎస్ జగన్ బొమ్మల విధ్వంసం, ఆయన పేరును తొలగించడం చూస్తున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ ఇంటి పేరుతో ఎక్కడా ఏదీ కనిపించకూడదని టీడీపీ, జనసేన నాయకులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని నానా రభస సృష్టిస్తున్నారు.
ఇంత వరకూ బాగానే వుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ, అలాగే వాలంటీర్ వ్యవస్థను విధ్వంసం చేసే దమ్ము చంద్రబాబునాయుడి ప్రభుత్వానికి వుందా? అనే ప్రశ్న వైసీపీ నేతల నుంచి వస్తోంది. వైఎస్సార్ విగ్రహాలు, వైఎస్ జగన్ ఫొటోలు, పేర్లను తొలగించినంత మాత్రాన… వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు. జగన్ మానస పుత్రికగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి.
ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోరంగా పరాజయం పాలై ఉండొచ్చు. కానీ ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలే నేడు కీలకం. అలాగే జగన్ అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి చంద్రబాబు తల్లికి వందనం అనే పేరు మార్చి అమలు చేస్తానని హామీ ఇచ్చారు. మరి వీటి మాటేంటి? జగన్ ఆలోచనల్ని కాపీ కొట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.
అల్లరి మూకలు వైఎస్సార్ విగ్రహాలను తొలగించడం లాంటి చర్యలతో కూటమి ప్రభుత్వం ఏర్పడకనే చెడ్డపేరు వచ్చిందని గ్రహిస్తే మంచిదని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు. ఇంతకాలం వైసీపీ అరాచక పాలన చేసిందని విమర్శించి, ఇప్పుడు కూడా అదే పంథాలో నడవడానికి ఆసక్తి చూపుతోందనే అభిప్రాయాన్ని వారం రోజుల్లోనే ఏర్పరిచారంటే అతిశయోక్తి కాదు.