ఇస్మార్ట్ శంకర్ కోసం స్టయిలిష్ గా తయారయ్యాడు రామ్ పోతినేని. ఆ సినిమాలో అతడు ఎంత మాస్ లుక్ లో కనిపించాడో, అతడి హెయిర్ స్టయిల్ అంతే స్టయిలిష్ గా కూడా ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మొదలైంది. మరి ఈసారి రామ్ లుక్ ఎలా ఉండబోతోంది? దీనికి తొందరగానే సమాధానం దొరికేసింది.
డబుల్ ఇస్మార్ట్ కోసం డబుల్ స్టయిలిష్ గా ముస్తాబయ్యాడు రామ్. దీని కోసం ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్ ను ఫాలో అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ తో హీరోకు తల వెనక భాగంలో ఓ చిప్ అమరుస్తారు. ఇది దానికి కొనసాగింపుగా వస్తున్న సినిమా కాబట్టి, డబుల్ ఇస్మార్ట్ లో కూడా హీరో తల వెనక చిన్న గాటు పెట్టారు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో దాన్ని స్పష్టంగా చూపించారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో మొన్నటివరకు స్కంద అనే సినిమా చేశాడు రామ్. ఆ సినిమా కోసం ఎక్కువ జుట్టుతో మాస్ లుక్ లో కనిపించాడు. ఇప్పుడు పూరి జగన్నాధ్ సినిమా కోసం వెంటనే మరో లుక్ లోకి మారిపోయాడు. రోజుల వ్యవధిలో రామ్ మారిన విధానం చూసి అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
రేపట్నుంచి సెట్స్ పైకి రాబోతోంది డబుల్ ఇస్మార్ట్. పూరి జగన్నాధ్, చార్మి నిర్మాతలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. హీరోయిన్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు. ప్రస్తుతానికి మీనాక్షి చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది.