జాతిరత్నాలు సినిమా తరువాత బడా సంస్థలు అన్నీ చిన్న సినిమాలు టేకప్ చేసి, చకచకా సినిమాలు చేసాయి. దాదాపు 90 శాతం బోర్లా పడ్డాయి. లెంపలేసుకుని ఇక చిన్న సినిమాలు పక్కన పెట్టేసాయి. జనం నాడి అర్థమైంది.
ఓ రేంజ్ సినిమా అయితే తప్ప ఓపెనింగ్ కళ్ల చూడడం కష్టం అని క్లారిటీ వచ్చింది. అందుకే ప్రతి బ్యానర్ చిన్న సినిమాల వైపు చూడడం తగ్గించారు. గీతా సంస్థ, గీతా2 సంస్థ కూడా చిన్న సినిమాల విషయంలో చాలా దెబ్బలు తినేసింది. ఒక దశలో బ్యానర్ వాల్యూ కూడా ఇబ్బందిలో పడింది.
అందువల్ల పెద్ద సినిమాల వైపు దృష్టి పెట్టింది. బన్నీ-త్రివిక్రమ్, సూర్య-బోయపాటి, చైతన్య-చందు ఇలా ఓ రేంజ్ సినిమాలు ప్లాన్ చేయడం ప్రారంభించింది. కానీ ఇదే టైమ్ లో ఈ నెల 13న మళ్లీ ఓ చిన్న సినిమాకు శ్రీకారం చుడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తో ఓ చిన్న సినిమా స్టార్ట్ చేస్తోంది. దీనికి అంజి అనే నూతన దర్శకుడు పని చేయబోతున్నారు.
నార్నే నితిన్ ఇప్పటికే ఓ సినిమా స్టార్ట్ చేసి దాదాపు ఫినిష్ చేసారు. కానీ అది అలా పక్కన వుండిపోయింది ఎందుకో? అందువల్ల గీతా బ్యానర్ కనుక ఇదే మొదటి సినిమా అనుకోవాలి. ఈ సినిమా ఓపెనింగ్ కాస్త హడావుడిగానే చేయబోతున్నారని తెలుస్తోంది.