ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇదే సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణం చేయబోతున్నారు.
ఒకవైపు 44ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సీఎం గా సారధ్యం వహిస్తుండగా.. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలోకి అడుగుపెడుతున్న పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉండడం విశేషం! ఈ సమయంలో మంత్రివర్గం కూర్పు విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఒక కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అనివార్యమైన పరిస్థితులలో చంద్రబాబు నాయుడు కూడా ఆ కండిషన్‌కు ఒప్పుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చేరాలా వద్దా అనే విషయంలో పవన్ కళ్యాణ్ చాలా దూరం ఆలోచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే స్వప్నంతో పవన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆయన అభిమానులంతా ‘‘సీఎం పవన్ సీఎం పవన్’’ అంటూ ప్రతి సభలోను రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేస్తూ ఆయనను ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో అదృష్టం కలిసి వస్తే సీఎం కావచ్చు అనే ఉద్దేశంతోనే, పవన్ కళ్యాణ్ పార్టీని ఒంటరిగా రాష్ట్రంలోని అన్ని స్థానాలలో పోటీ చేయించారు. కానీ తీవ్రమైన పరాభవం ఎదురయింది.
ముఖ్యమంత్రి కావాలనుకున్న తాను, మంత్రి పదవితో సర్దుకోవడం కంటే కేవలం పార్టీ అధినేతగా ఉంటూ తన అనుచరులను మంత్రులు చేసి రాజకీయం నడిపించవచ్చునా అని పవన్ కళ్యాణ్ యోచించారు. కానీ ఆత్మీయుల సలహా మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని పుచ్చుకుని క్యాబినెట్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
అయితే అందుకు గాను పవన్ కళ్యాణ్ పెట్టిన కండిషన్ ఏంటంటే ‘ఉపముఖ్యమంత్రిగా తన పేరు ఒక్కటే ఉండాలి. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాల పేరు పెట్టి మరొక ఉపముఖ్యమంత్రిని నియమించడానికి వీల్లేదు’ అని! అలా జరిగితే తన ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆయన భయపడినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు కూడా ఈ కండిషన్‌కు ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమే ఉపముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వంలో కొనసాగుతారు. చంద్రబాబు తర్వాత అంతటి ప్రాధాన్యం తనదేనని ఆయన రాష్ట్ర ప్రజలకు సంకేతాలు ఇవ్వదలుచుకున్నట్లుగా తెలుస్తోంది.