కాంగ్రెస్ హామీని ఆచరణలో పెడుతున్న మోడీ

ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టిన నరేంద్రమోడీ 3.0 ప్రభుత్వాన్ని 71 మంది మంత్రివర్గ సహచరులతో కొలువు తీర్చారు. మంత్రులందరికీ శాఖలు కూడా కేటాయించేశారు. వారంతా పని కూడా ప్రారంభించేశారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం…

ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టిన నరేంద్రమోడీ 3.0 ప్రభుత్వాన్ని 71 మంది మంత్రివర్గ సహచరులతో కొలువు తీర్చారు. మంత్రులందరికీ శాఖలు కూడా కేటాయించేశారు. వారంతా పని కూడా ప్రారంభించేశారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. తమ మెజారిటీ స్థానాలను గణనీయంగా తగ్గించేసిన కీలక అంశాల మీద మోడీ సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వారు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.

అదే సమయంలో.. ఏ అంశాల విషయంలో అయితే కాంగ్రెస్, ఇతర విపక్షాలు తమ ప్రభుత్వాన్ని కార్నర్ చేసి.. పైచేయి సాధించడానికి ప్రయత్నించాయో.. ప్రజలను నమ్మించగలిగాయో అలాంటి విషయాలపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మోడీ సర్కారే అడుగులు వేస్తుండడం విశేషం.

ఇందుకు అగ్నిపథ్ పథకమే పెద్ద ఉదాహరణ. సైనిక నియామకాలకు సంబంధించిన ఈ వ్యవహారం.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలలో ఒకటి. సాంకేతికంగా ఆ పథకం వల్ల ప్రయోజనాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఉత్తరాదిలో అనేక రాష్ట్రాల్లో సైన్యంలోకి వెళ్లడాన్ని ఒక శాశ్వతమైన ఉపాధిమార్గంగా భావించే వేలాది కుటుంబాలకు ఆ నిర్ణయం అశనిపాతం అయింది. అందుకే తమను గెలిపిస్తే అగ్నిపథ్ ను సమీక్షిస్తామని, రద్దు చేస్తామని కాంగ్రెస్, ఇతర విపక్షాలు  కూడా ప్రకటించాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి ఆశించిన స్థానాలు దక్కకపోవడానికి అగ్నిపథ్ ఒక ప్రధాన కారణం అని, అంతర్గత సమీక్షల్లో పార్టీ గుర్తించింది. దీంతో ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా, సమీక్షించబోతోంది. శాశ్వత ఉద్యోగాలు కోరుకునే వారికి అసంతృప్తి కలగకుండా ఈ పథకంలో విధివిధానాలను మారుస్తారు.

కేవలం అగ్నిపథ్ మాత్రమే కాదు. 400 పైగా సీట్లు ఆశించి, సాగించిన ఎన్నికల సమరంలో కేవలం 293 వద్ద ఆగిపోవడానికి కారణమైన, ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న అనేక ఇతర అంశాలను కూడా మోడీ ప్రభుత్వం సమీక్షించనుంది. ఆత్మసమీక్షలేకుండా ముందుకు దూసుకెళ్లడం మంచిది కాదని, ప్రజలు తిరస్కరిస్తున్న వాటిని దిద్దుకుంటే గనుక.. భవిష్యత్తు సుస్థిరంగా ఉంటుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.