బుధవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా వారి అభిమానులు, వారిపట్ల భక్తిని ప్రదర్శించుకునేవారు, వారి ద్వారా లబ్ధి పొందాలని ఆశించేవారు అందరూ కూడా పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో ప్రకటనలు ఇవ్వడం సర్వసాధారణం.
అయితే ఇప్పుడు పచ్చపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో 11వ తేదీ బుధవారం నాడు ప్రకటనలు ప్రచురించడానికి అసలు పేజీలు ఖాళీ లేవుట. చంద్రబాబు ప్రమాణం సందర్భంగా ఈ రెండు పత్రికలు కూడా ప్రత్యేక అనుబంధాలను ప్రచురించబోతున్నట్టుగా తెలుస్తోంది.
పత్రికలు జాకెట్ యాడ్ లు ప్రచురిస్తుంటాయి. పత్రిక లోగో తప్ప మిగిలిన పేజీ మొత్తం ప్రకటనే ఉండేలా మొదటిపేజీని తయారుచేయడాన్ని జాకెట్ యాడ్ అంటారు. దీని టారిఫ్ కూడా సహజంగానే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పేజీలో మళ్లీ లోగో పెట్టి వార్తలతో నింపుతారు. అది అసలైన మొదటిపేజీ అవుతుంది. అలా జాకెట్ యాడ్స్ ఒకటికంటె ఎక్కువ ఉన్నప్పుడు.. అసలైన మొదటిపేజీ అంతగా లోపలకు వెళ్లిపోతుందన్నమాట.
ఇప్పుడు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరు ప్రముఖులు ప్రమాణం చేస్తుండడంతో.. వారి వారి అభిమానులు అందరూ జాకెట్ యాడ్స్ ఇవ్వడానికే ఎగబడుతున్నారు. కేవలం రాజకీయ, వ్యాపార ప్రయోజనాలు ఆశిస్తున్న వారు మాత్రమే కాదు. ఈ అగ్ర నాయకుల మీద తమ అభిమానాన్ని చాటుకోవడానికి కూడా అనేక మంది ప్రకటనలు పోటెత్తిస్తున్నట్టుగా సమాచారం.కమ్మ, కాపు వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు కూడా ప్రకటనలు ఇస్తున్నారు.
దీంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలకు అసలు పేజీలు చాలడం లేదుట. అందుకే పెద్దసంఖ్యలో పేజీలను పెంచి అనుబంధాలను ప్రచురించబోతున్నారు. సుమారు 50 పేజీల పత్రికలు వెలువడవచ్నని అనుకుంటున్నారు. అదేసమయంలో మరో సంగతి ఏంటంటే.. చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజెబుతూ భారీ ప్రకటనలు వచ్చినా సరే.. వాటిని తీసుకోకూడదని సాక్షి దినపత్రిక నిర్ణయించినట్టుగా సమాచారం.