వలంటీర్లకూ ఉమన్ ట్రాఫికింగ్ కు ముడిపెట్టి.. దానిలోకి కేంద్ర నిఘా వర్గాలు అంటూ నోటికొచ్చినట్టుగా పవన్ కల్యాణ్ ఏదో ఊగిపోయాడు, వాగిపోడు! కేంద్రంలోని పెద్దలు, నిఘా వర్గాలు అంటూ మాట్లాడితే తన మాటలకు బరువు పెరుగుతుందనేంత మూర్ఖత్వం పవన్ కల్యాణ్ కు ఉందా అనే ఆశ్చర్యం కలుగుతుందిప్పుడు!
ఉమన్ ట్రాఫికింగ్ అంటే అదేమీ అల్లాటప్పా వ్యవహారం కాదు. ప్రతి సంవత్సరం ఇందుకు సంబంధించి గణాంకాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడిస్తుంది. ఏ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో చెబుతుంది. ఇదేమీ అత్యంత రహస్యమైన సమాచారమూ కాదు. ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ కు కేంద్ర నిఘా వర్గాలు చెప్పడానికి! ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి నుంచి అందరి దృష్టీ ఉంటుంది. ఉమన్, చైల్డ్ ట్రాఫికింగ్ గురించి రకరకాల పరిశీలనలూ అధ్యయనాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు వంటివి వీటి పై పని చేస్తూ ఉంటాయి. కాబట్టి.. ఏ రాష్ట్రమో ఇలాంటి అంశాల గురించి దాచేస్తే దాగే అంశాలు కావివి.
ఈ మధ్యనే కేరళపై ఇలాంటి బురదే పోశారు ఒక సినిమాతో. అయితే ఆ సినిమా విషయంలో కూడా చివర్లో నంబర్ ను మార్చేశారు. ఆ సినిమా ట్రైలర్లో ఎన్నో వేల మంది కేరళ మహిళలు ఐసిస్ లో పాలయ్యారంటూ మొదట చెప్పి, దుమారం రేగే సరికి.. తూచ్ అన్నారు. ఆ నంబర్ ను తీసేస్తున్నామన్నారు! కాబట్టి.. ఇదేమీ తేలికైన అంశం కాదు.
మరి తను కూడా అలాంటి సినిమా వాడినే కాబట్టి.. తను కూడా ఏదో ఒకటి మాట్లాడేస్తే పోతుందని పవన్ కల్యాణ్ ఏపీపై పెద్ద మరక అంటించే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు ఆ మాటకు కట్టుబడే సీన్ కానీ, చేసిన ఆరోపణలను నిరూపించేందుకు ఆధారాలను కానీ జనసేన తీసుకురావడం లేదు. ఆ పార్టీకి అంత వ్యవస్థ ఎలాగూ లేదు. ఇక టీవీ చానళ్ల చర్చాకార్యక్రమాల్లో కూడా… పవన్ ఎన్నో మాట్లాడాడు అని, అయితే ఉమన్ ట్రాఫికింగ్ గురించినే చర్చ ఎందుకంటూ ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు!
ఇదీ పవన్ మాటలకు ఆయన పార్టీ వాళ్లే ఇచ్చే విలువ! ఉమన్ ట్రాఫికింగ్ నేరాల లోతుల్లోకి వెళితే కొన్ని విస్మయకరమైన అంశాలు, కొన్ని విచిత్రమైన అంశాలు కూడా కనిపిస్తాయి. ఏపీలో కావొచ్చు, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కావొచ్చు.. నమోదవుతున్న ఉమన్ ట్రాఫికింగ్ కేసుల్లో 80 శాతం వరకూ ప్రేమ పెళ్ళిళ్లు, లేచిపోయి పెళ్లిళ్ల కేసులు.
యుక్త వయసులోని అమ్మాయిలు లేచిపోతేనో, లేక తమకు ఇష్టమైన వాడిని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటేనో.. చాలా మంది తల్లిదండ్రులు వారిని దారికి తెచ్చుకోవచ్చనే ప్రయత్నంతో ముందుగా పోలిస్ స్టేషన్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. తమ కూతురును ఫలానా వాడు, లేదా ఫలానా కుటుంబం, ఫలానా వాడు-వాడి స్నేహితులు అపహరించారంటూ వారు పోలిస్ లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో పారిపోయిన జంటలను పోలీసులు పట్టుకుని రావడం, అమ్మాయిలు మైనర్లు అయ్యే పక్షంలో అబ్బాయిలపై కేసులు పెట్టడం లేదా, ఇద్దరూ మేజర్లు అయితే రాజీ కుదర్చడం, అమ్మాయి అభిప్రాయం తీసుకుని ఆమె తల్లిదండ్రులకు పరిస్థితిని అర్థమయ్యేలా చేయడం.. వంటివి చేస్తూ ఉంటారు. చాలా పోలిస్ స్టేషన్లలో ఇలాంటి కేసులు వస్తూనే ఉంటాయి. ఇలాంటి కేసులను పరిష్కారం అయినవిగా పోలీసులు నమోదు చేసుకుంటూ ఉంటారు. 80 శాతం కేసులు ప్రేమ-దాని పర్యవసనాల కేసులే. ఇక 20 శాతం కేసులు మాత్రం తీవ్రమైనవి.
ఈ కేసుల్లో చాలా వరకూ మాయమైన స్త్రీల ఉనికి కూడా మళ్లీ కనిపించడం లేదు. ఇది ఏ ఏపీ కో సంబంధించిన సమస్య కాదు! దేశంలో, ప్రపంచమంతా ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిష్కారం కేసుల జాబితాలో పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఇంకా ఉత్తరాది రాష్ట్రాలు ముందు వరసలో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో చాలా మంచి స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అధికారిక సమాచారంలోని గణాంకాల ద్వారా తెలిసే అంశాలే.
మరి దేశంలో ఉమన్ ట్రాఫికింగ్ కేసులు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని పట్టుకుని.. ఇక్కడి వలంటీర్లు ఉమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, వైసీపీ నేతలు వారిని ఆ పని కోసం నియమించుకున్నారంటూ పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. వలంటీర్లు లేని దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింటిలో కెళ్లా కూడా తక్కువ స్థాయిలో ఉమన్ ట్రాఫికింగ్ కేసులున్న రాష్ట్రంపై ఇలాంటి బురద జల్లేస్తే తన పని అయిపోతుందని పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడు.
నోటికొచ్చిందల్లా వాగేసి వెళ్లిపోతే తను వార్తల్లో నిలుస్తాను అని పవన్ అనుకుంటూ ఉండవచ్చు. ఈ వదరబోతుతనంతో ఉన్న వ్యక్తి పాతికేళ్ల రాజకీయం కోసం వచ్చాడనుకోవాలా.. బహుశా పాతికేళ్లూ పవన్ చేసే రాజకీయం ఇలాంటిదే కాబోలు!