స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. తాజాగా కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి వర్ధన పేట, స్టేషన్ ఘనపూర్‌ల నుండి పోటీ చేయడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసినట్లు ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పరోక్షంగానే కాదు.. నేరుగా విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంటోంది. అటు స్టేషన్ ఘనపూర్‌లో నేతల వరుసగా కామెంట్లపై దృష్టి పెట్టిన సీఎంఓ రాజయ్యను ప్రగతి భవన్‌కు రావాలని పిలిచినట్లు తెలుస్తోంది.
కడియం దళితుడు కాదన్న కామెంట్స్‌పై వారంలో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రాజయ్య డెడ్‌లైన్ పెట్టగా.. మళ్లీ ఇలాంటి కామెంట్లు చేయడం గమనార్హం. మరోవైపు గతంలో రాజయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు… కడియం శ్రీహరి సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుండి కాంగ్రెస్ వచ్చిన వ్యక్తి కావడంతో పాటు పార్టీలో తన పట్టు కోసం మాజీ టీడీపీ నేతలకు గాలం వేస్తుండంతో.. తాజా రాజయ్య ఆరోపణలతో కడియంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.