రాజకీయాల్లో కొన్ని కీలక విషయాల మీద కొందరు తమ అభిప్రాయాలు చెబుతుంటారు. పార్టీల అధిష్టానాలు అధికారికంగా చెప్పాల్సిన విషయాలు అంటే విధాన నిర్ణయాలు కూడా కొందరు మంత్రులు, పార్టీలో ముఖ్య నాయకులు బహిరంగంగా చెబుతుంటారు. ఇది వాళ్ళు అధికారికంగా చెబుతున్నారా? వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయమో అర్ధం కాక బుర్ర గోక్కోవలసి వస్తుంది. అలా గోక్కోవలసిన పరిస్థితి ఓ కేంద్ర మంత్రి కల్పించారు.
కేంద్రంలో సామాజిక న్యాయ శాఖలో అబ్బయ్య నారాయణ స్వామి అనే సహాయ మంత్రి ఉన్నాడు. ఆయన బెంగళూరు నుంచి పావగడకు వెళుతూ సత్యసాయి జిల్లా మడకశిరకు ఓ కార్యాక్రమంలో పాల్గొనడానికి వచ్చాడు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ -బీజేపీ -జనసేన మధ్య పొత్తు ఉంటుందని చెప్పాడు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నింటినీ కలుపుకు వెళతామన్నారు. ఒక కేంద్ర మంత్రి చెప్పిన విషయం కాబట్టి ఇందులో నిజం ఉండొచ్చు. అయితే బీజేపీ అధిష్టానం ఇప్పటివరకు ఈ విషయం అధికారికంగా చెప్పలేదు. అటు చంద్రబాబు నాయుడు గానీ, ఇటు పవన్ కళ్యాణ్ గానీ చెప్పలేదు.
చంద్రబాబు బీజేపీతో జనసేనతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న మాట వాస్తవమే. కానీ బాబు, పవన్ దీనిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. పొత్తులపై పవన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఎలాంటి వ్యూహం పన్నాలో తెలియక గందరగోళంగా ఉన్నాడు. ఒకపక్క సినిమాలూ వదులుకోలేడు. మరోపక్క రాజకీయాలు వదులుకోలేడు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. పొత్తు తప్పనిసరి. అలాంటప్పుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? రెండు పార్టీలతో పెట్టుకోవాలా ? అనేది తేల్చుకోలేకపోతున్నాడు. అసలు పొత్తులు పెట్టుకోవాలా వద్ద అనే విషయంలో కూడా పవన్ కు క్లారిటీ లేదు. పొత్తులపై భిన్నమైన స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు.
కొంతకాలం కిందట పొత్తులు ఉంటాయని చెప్పిన పవన్ తాజాగా పొత్తులు పెట్టుకోవడంపై అధ్యయనం చేస్తామంటున్నాడు. కొంత కాలం కింద మాట్లాడుతూ …”ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి.. బలమున్న పార్టీలతో కలిసే పోటీ చేస్తాం.. నేను సీఎం పదవికి కండీషన్లు పెట్టను..” అన్నాడు.
2014లో కూడా అన్నీ అధ్యయనం చేసిన తరువాతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నాడు. గతంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయనే సంగతి గుర్తుంచుకోవాలని అన్నాడు. గౌరవానికి భంగం కలగకుండా పొత్తులు ఉంటాయని చెప్పాడు. గతంతో పోలిస్తే జనసేన బలం గణనీయంగా పెరిగిందని గుర్తు చేశాడు.
గత ఎన్నికల్లో జనసేన పార్టీకు సగటున 7 శాతం ఓట్లు రాగా, ఈసారి ఆ బలం 18-19 శాతానికి పెరిగిందన్నాడు. 2019 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నామన్నాడు. ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే పొత్తుల గురించి మాట్లాడానని అన్నాడు. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశామని..అప్పట్లో కనీసం 30-40 స్థానాలు గెల్చుకునుంటే కర్ణాటక తరహా పరిస్థితి ఉండేదన్నాడు.
దీంతో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లియర్ కట్‌గా హింట్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఇప్పటికే ప్రజల్లో ఓ అభిప్రాయం ఏర్పడింది. అందుకు తగినట్లుగానే అధికార వైఎస్సార్సీపీ ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతి సభలోనూ జనసేన-టీడీపీని కలిపి విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయడం లేదని పరోక్షంగా చెప్పాడు. 40 సీట్లుంటే సీఎం పదవి అడిగేవాడినన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు. అయితే పొత్తులపై అంతా ఒకే అనుకుంటున్న సమయంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. “పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉంది.. ఒంటరిగా వెళ్లాలా.. కలసి వెళ్లాలా అనేది తరువాత మాట్లాడుకునే విషయం. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుంది..” అంటూ కామెంట్స్ చేశాడు.
దీంతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఇన్నాళ్లు పొత్తులు ఉంటాయని ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్.. సడెన్‌గా తరువాత మాట్లాడుకునే విషయం అనడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ యూటర్న్ తీసుకున్నారా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పొత్తులపై చర్చ కంటే ప్రజల్లోకి జనసేనను మరింత బలంగా తీసుకెళ్లడంపై పవన్ దృష్టిసారించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.