ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి అనేక రాజకీయ మార్పులకు దారి తీస్తోంది. అధికారం ఎక్కడుంటే, రాజకీయ నాయకులు అక్కడుంటారని ప్రత్యేకంగా ఏపీ పరిణామాలే ఉదాహరణగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భూమి గుండ్రంగా వుందనేది ఎంత నిజమో, అధికారం చుట్టూ నాయకులు ప్రదక్షిణ చేస్తారనేది కూడా అంతే వాస్తవం. ఈ నేపథ్యంలో అధికారాన్ని పోగొట్టుకున్న వైసీపీని వీడేందుకు ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ముఖ్య నేతలు సిద్ధంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో నెల్లూరు నగర మేయర్ స్రవంతి… వైసీపీకి రెండోసారి షాక్ ఇచ్చారు. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీని వీడినప్పుడు, మేయర్ స్రవంతి కూడా ఆయన వెంటే నడిచారు. అయితే కొన్ని రోజులకే ఆమె తిరిగి వైసీపీ పంచన చేరారు. ఆ సందర్భంలో తాను వెనక్కి రావడానికి దారి తీసిన పరిస్థితుల్ని చెబుతూ, వైఎస్ జగన్‌కు క్షమాపణ చెప్పారు.
తాజాగా నెల్లూరు నగర మేయర్ మరోసారి అలాంటి మాటల్నే చెప్పడం గమనార్హం. ఇప్పుడు టీడీపీలో చేరడానికి తనను తాను సమర్థించుకోవడం గమనార్హం. ఇవాళ మీడియాతో ఆమె మాట్లాడుతూ తాను, తన భర్త జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశామన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెంట నడుస్తామని ఆమె ప్రకటించడం విశేషం. శ్రీధర్‌రెడ్డి వల్లే తనకు మేయర్ పదవి దక్కిందన్నారు.
తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అవకాశం కల్పించారన్నారు. శ్రీధర్‌రెడ్డి వైసీపీని వీడిన సందర్భంలో ఆయన వెంటే నడుస్తానని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. అయితే నాడు అధికార పార్టీ ఒత్తిళ్లతో తిరిగి వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందన్నారు. శ్రీధర్‌రెడ్డిపై విమర్శలు చేయాలని అప్పట్లో వైసీపీ నాయకులు ఒత్తిడి చేశారన్నారు. తమ తప్పుల్ని శ్రీధర్‌రెడ్డి మన్నించి, టీడీపీలో చేర్చుకుని, ఆదరించాలని ఆమె కోరడం గమనార్హం.