చంద్రబాబులో మార్పు నిజమైతే.. ఇదే రుజువు!

చంద్రబాబు మళ్ళీ ఒకసారి తాను మారిపోయిన చంద్రబాబును అని చెప్పుకుంటున్నారు! ఇలా చెప్పుకోవడం ఆయనకు కొత్త కాదు! గతంలో ఓడిపోయిన తర్వాత మళ్లీ పగ్గాలు చేపట్టిన సందర్భంలో ఆయన ఇదే మాదిరిగా ‘నేను మారిపోయిన…

చంద్రబాబు మళ్ళీ ఒకసారి తాను మారిపోయిన చంద్రబాబును అని చెప్పుకుంటున్నారు! ఇలా చెప్పుకోవడం ఆయనకు కొత్త కాదు! గతంలో ఓడిపోయిన తర్వాత మళ్లీ పగ్గాలు చేపట్టిన సందర్భంలో ఆయన ఇదే మాదిరిగా ‘నేను మారిపోయిన చంద్రబాబును’ అని చెప్పుకున్నారు. కానీ మాటల దశ దాటి ఆచరణలో కొంత దూరం వచ్చేసరికి- చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మారే రకం కాదని, ఆయన అదే పాతతరం- పాత ఆలోచనల చంద్రబాబు అని పార్టీ నాయకులే విమర్శిస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు 2024 ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఇదే మాట చెబుతున్నారు. ‘నేను మారిపోయిన చంద్రబాబును’ అంటున్నారు. ఒకవేళ చంద్రబాబులో మార్పు వచ్చిన మాట వాస్తవమే అయితే గనుక.. అందుకు ఒకే ఒక్క విషయం రుజువు అని.. ఆయన ఆ రకంగా చేస్తారో లేదో చూడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అదేమిటంటే నామినేటెడ్ పోస్టులను సత్వరం భర్తీ చేయడం!

చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. 2014లో అధికారంలోకి వచ్చిన సందర్భంలో చాలా నామినేటెడ్ పోస్టుల విషయంలో భర్తీ చేయకుండానే మూడేళ్లకు పైగా గడిచిపోయాయి. ఆ పదవిలోకి వచ్చినవారు రెండేళ్లు పూర్తి సమయం పదవిని అనుభవించకుండానే రాజీనామా చేయాల్సిన సందర్భాలు అనేకం. ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించారు.

టిటిడితో సహా అనేక నామినేటెడ్ పోస్టులను ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు భర్తీ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అధికారం చేపట్టిన వెంటనే పార్టీని నమ్ముకుని పనిచేసినది నాయకులు ఇతర సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టడాన్ని అగ్ర ప్రాధాన్యంగా జగన్ భావించారు.

చంద్రబాబు నాయుడు తీరు అలాంటిది కాదు. ఆయన ఒకరికి ఒక పదవి ఇవ్వాలంటే సవాలక్ష కారణాలు ఆలోచిస్తారు. ఇస్తే వారికి అహంకారం పెరుగుతుందా, పార్టీకి లోబడి ఉంటారా లేదా? అనే అనేక అంశాలను చంద్రబాబు ఆలోచిస్తూ అసలు పదవులు ఇవ్వకుండా సంవత్సరాలు కూడా గడిపేస్తారు. అందుకే పోయినసారి అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం రెండేళ్లు కూడా అనుభవించే యోగ్యత లేకుండా పదవులను భర్తీ చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఒకవేళ ఆయన మారిన చంద్రబాబు అనే మాట నిజమే దే కనుక తాను అధికారం చేపట్టిన ఒక నెల రోజులలోగా మొత్తం అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని, దాని వలన ఈ ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోగా కనీసం మూడుసార్లు పాలకవర్గాలు ఏర్పడతాయని కార్యకర్తలు అంటున్నారు. ఎక్కువమంది పార్టీ నాయకులకు ఏదో ఒక అవకాశం కల్పించినట్లుగా ఉంటుందని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడుకు వారి కోరికలు వినబడతాయో లేదో.!