ఇంకో నందమూరి వారసుడు

టాలీవుడ్ లోకి ఇంకో వారసుడు వస్తున్నాడు. నందమూరి వంశం నుంచి ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా కాలంగా మెగాఫోన్ కు దూరంగా వున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి మళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. నిర్మాతగా కూడా…

టాలీవుడ్ లోకి ఇంకో వారసుడు వస్తున్నాడు. నందమూరి వంశం నుంచి ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా కాలంగా మెగాఫోన్ కు దూరంగా వున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి మళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించబోతున్నారు. మాస్ సినిమాలను అందించడంలో వైవిఎస్ చౌదరి ది మంచి హ్యాండ్. అయితే ఒకటి రెండు గట్టి ఫ్లాపులు పలకరించడంతో, వెనుక వుండిపోయారు. ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగుతున్నారు.

ఈసారి హీరోగా నందమూరి వంశానికి చెందిన కుర్రాడిని తెరమీదకు తెస్తున్నారు. నందమూరి హరికృష్ణ కు వైవిఎస్ చౌదరికి మంచి సాన్నిహిత్యం వుండేది. హరికృష్ణ ను సీతయ్యగా అద్భుతంగా చూపించిన సంగతి గుర్తున్నదే. ఇప్పుడు అదే నందమూరి హరికృష్ణ మనవడిని హీరోగా పరిచయడం చేయబోతున్నారు.

నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ తనయుడే ఈ హీరో. అతగాడి పేరు కూడా నందమూరి తారక రామారావు నే. ప్రమాదంలో జానకి రామ్ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జానకిరామ్ సోదరులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆ కుటుంబానికి అండగా వుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ విషయం వారికి తెలియదని బోగట్టా.

వైవిఎస్ చౌదరి గతంలో కొన్ని సినిమాల వల్ల ఆర్ధికంగా గట్టి దెబ్బతిన్నారు. అయితే ఇటీవల ఆయనకు గతంలో పెట్టిన పెట్టుబడులు కొన్ని కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మళ్లీ వనరులు సమకూర్చుకుని, నిర్మాతగా కూడా రంగంలోకి దిగుతున్నారు.