థియేటర్లకు రమ్మని అడిగే హక్కు ఉందా?

చిన్న నిర్మాతల సంగతి సరేసరి. పెద్ద నిర్మాతలు కూడా ఆపుకోలేకపోతున్నారు. తమ సినిమాను 2 వారాలకే ఓటీటీకి అప్పగించేస్తున్నారు. తమ బొమ్మ ఫ్లాప్ అయిందని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బడా నిర్మాతలు ఇలా…

చిన్న నిర్మాతల సంగతి సరేసరి. పెద్ద నిర్మాతలు కూడా ఆపుకోలేకపోతున్నారు. తమ సినిమాను 2 వారాలకే ఓటీటీకి అప్పగించేస్తున్నారు. తమ బొమ్మ ఫ్లాప్ అయిందని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బడా నిర్మాతలు ఇలా వ్యవహరించారు. తాజాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి మరో సినిమా ఉరుకులు పరుగుల మీద ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఎందుకంత తొందర?

సితార బ్యానర్ పై విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తమ అన్ని సినిమాల్లానే ఈ సినిమాకు కూడా గట్టిగా ప్రచారం చేసింది ‘సితార’. అదే స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కూడా చేసింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సినిమా సూపర్ హిట్ అని కూడా ప్రకటించింది. మరి అంతలోనే ఓటీటీకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?

మే 31న రిలీజైంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. ఇప్పుడీ సినిమా 14వ తేదీకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అంటే రిలీజైన 2 వారాలకే ఓటీటీలోకి ప్రత్యక్షమన్నమాట. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు, ఇంతకుముందు కూడా కొన్ని పెద్ద సినిమాలు ఇలా ఆఘమేఘాల మీద ఓటీటీలోకి వచ్చేశాయి. పెద్ద నిర్మాతలే ఇలా ఉంటే, ఇక చిన్న సినిమాలు క్యూ కట్టవా..?

ఇకపై అలా అడిగే హక్కు ఉందా..?

“ఎంతో కష్టపడి సినిమా తీశాం.. భారీగా డబ్బులు ఖర్చు పెట్టాం.. కచ్చితంగా మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుంది.. మా సినిమా థియేటర్లలోనే చూడండి.” విడుదలకు ముందు ప్రతి మేకర్ కామన్ గా చెప్పే డైలాగ్ ఇది. ఇకపై ఇలా చెప్పే హక్కును దాదాపు అంతా కోల్పోయినట్టే. రిలీజైన 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నప్పుడు, ఏ సినిమానైనా థియేటర్లలో ఎందుకు చూడాలి. మరీ ముఖ్యంగా యావరేజ్ టాక్ తో ఆడుతున్న సినిమాల కోసం థియేటర్లకు ప్రేక్షకులు ఎందుకు వెళ్లాలి?

“హిట్టయిన సినిమా ఎలాగైనా ఆడుతుంది. ఫ్లాప్ అయిన సినిమాను ఎవ్వరూ కాపాడలేరు. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. అలాంటి సినిమాల్ని కాపాడుకుంటేనే థియేటర్లు బాగుంటాయి.” ఓ సందర్భంలో ఓ పెద్దమనిషి చెప్పిన మాటిది. అతడే తన సినిమాను 2 వారాలకే ఓటీటీకి ఇచ్చేస్తున్నాడు.

థియేటర్లను కాపాడుకోవాలని, సినిమాను బతికించాలని వాళ్లే అంటారు. రిలీజైన 7 వారాల్లోపు స్ట్రీమింగ్ కు ఇవ్వకూడదని రూల్స్ వాళ్లే పెడతారు. కట్ చేస్తే, తమ సినిమాను రిలీజైన 2 వారాలకే ఓటీటీకి స్వయంగా వాళ్లే ఇచ్చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రేక్షకుడు ఎందుకు థియేటర్లకు రావాలి.

ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి ఎలా తయారైందంటే.. సినిమా ఫ్లాప్ అయితే వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. యావరేజ్ అయితే 2 వారాలకే స్ట్రీమింగ్ అయిపోతుంది.