చంద్రబాబునాయుడి కేబినెట్ కూర్పుపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు దక్క వచ్చనే చర్చకు తెరలేచింది. మరీ ముఖ్యంగా భారీగా కూటమికి ఎమ్మెల్యేల బలం వుండడంతో ఎవరికి ఇవ్వాలో, ఇవ్వకూడదో చంద్రబాబుకు తేల్చుకోవడం కష్టమైంది.
ఈ నేపథ్యంలో మంత్రి పదవి రేస్‌లో కడప రెడ్డెమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన రెడ్డెప్పగారి మాధవీరెడ్డి మంత్రి పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. కడప జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి ఆమె రావడం, మాధవీరెడ్డి భర్త శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘ కాలంగా టీడీపీకి ఆర్థికంగా దన్నుగా నిలబడడం కూడా మంత్రి పదవి ఇచ్చేందుకు కలిసొచ్చే విషయంగా చెబుతున్నారు.
కడపలో వైఎస్ జగన్‌ను కట్టడి చేయడానికి మాధవీరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడమే సరైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైనార్టీ సీటుగా ముద్రపడిన కడపలో వైసీపీని మట్టి కరిపించిన మాధవీరెడ్డికి టీడీపీలో ప్రత్యేక గౌరవం వుంది. మాధవీరెడ్డికి చొరవ ఎక్కువ. దూకుడు స్వభావం కలిగిన మాధవీరెడ్డికి మంత్రి పదవి ఇస్తే, జగన్ సొంత జిల్లాలో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి పనికొస్తుందనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం మాధవీరెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డి తమ వంతు ప్రయత్నాల్ని వేగవంతం చేశారని సమాచారం.