వైసీపీకి ఇదొక్క‌టే శ్రీ‌రామ ర‌క్ష‌

ఘోర ప‌రాజ‌యం చెంద‌డాన్ని వైసీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. మ‌రీ ఇంత వ్య‌తిరేక‌త ఏముంద‌బ్బా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఐదేళ్ల పాల‌న‌లో చేసిన త‌ప్పులేంటి? ఎందుకిలా జ‌రిగింది? అనే అంత‌ర్మ‌థ‌నం ఆ పార్టీలో జ‌రుగుతోంది. అయితే ఎన్నిక‌ల్లో…

ఘోర ప‌రాజ‌యం చెంద‌డాన్ని వైసీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. మ‌రీ ఇంత వ్య‌తిరేక‌త ఏముంద‌బ్బా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఐదేళ్ల పాల‌న‌లో చేసిన త‌ప్పులేంటి? ఎందుకిలా జ‌రిగింది? అనే అంత‌ర్మ‌థ‌నం ఆ పార్టీలో జ‌రుగుతోంది. అయితే ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జ‌మ‌ని, ఏవీ శాశ్వితం కాద‌ని వైసీపీ నేత‌లు త‌మ‌ను తాము ఓదార్చుకుంటున్నారు. కింక‌ర్త‌వ్యం ఏంట‌ని వారు ఆలోచిస్తున్నారు.

ఈ నెల 12న కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంది. అనంత‌రం ప్ర‌భుత్వ చ‌ర్య‌లు ఎలా వుంటాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాలంటే చేయాల్సింద‌ల్లా… స‌హ‌నంతో ఎదురు చూడ‌డ‌మే. కూట‌మి ప్ర‌భుత్వం అలివికాని హామీల‌ను ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వాటిని అమ‌లు చేయాలంటే మూడు రాష్ట్రాల బ‌డ్జెట్ అవ‌స‌ర‌మ‌నే చ‌ర్చ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగింది. అధికారం కోసం తాను చంద్ర‌బాబులా అలివికాని హామీలు ఇవ్వ‌లేన‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెప్పారు.

కూట‌మి హామీల‌నే జ‌నం న‌మ్మి ప‌ట్టం క‌ట్టారు. ఇప్పుడు హామీల‌ను అమ‌లు చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. మొద‌ట‌గా రూ.7 వేలు చొప్పున పింఛ‌న్‌ను అందించాల్సి వుంది. ఆ త‌ర్వాత నెల నుంచి రూ.4 వేలు ఇవ్వాలి. అలాగే ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, ఏడాదికి ఉచితంగా మూడు సిలిండ‌ర్ల పంపిణీ, ఏడాదికి రూ.20 వేలు చొప్పున రైతు భ‌రోసా, 50 ఏళ్లు పైబ‌డిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు పింఛ‌న్‌, అలాగే ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు చ‌దువుకుంటుంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు, అలాగే 18 ఏళ్లు పైబ‌డిన ప్ర‌తి మ‌హిళ‌కూ నెల‌కు రూ.1500 చొప్పున పంపిణీ.. ఇలా అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై వుంది.

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు సంబంధించి ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అర్హ‌త‌ల‌కు సంబంధించి ఎలాంటి నియ‌మ నిబంధ‌న‌ల‌ను తీసుకొస్తుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఏ మాత్రం విఫ‌ల‌మైనా… మ‌ళ్లీ వైసీపీకి బంగారు ప‌ల్లెంలో అధికారాన్ని పెట్టి ఇవ్వ‌డం ఖాయం అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తామిచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డం చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అతిపెద్ద స‌వాల్‌. అస‌లే చంద్ర‌బాబుకు ఒక బ్రాండ్ వుంది. క‌నీసం ఇప్పుడైనా ఆ నెగిటివిటీ నుంచి బ‌య‌ట ప‌డాలంటే చెప్పింది చేయాల్సి వుంటుంది. అందుకే వైసీపీ నేత‌లు ఓట‌మితో కుంగిపోకుండా ఎంతో స‌హ‌నంతో భ‌విష్య‌త్‌పై ఆశావ‌హ దృక్ప‌థంతో ఎదురు చూడాల్సి వుంటుంది. స‌హ‌నం ఒక్క‌టే వైసీపీకి శ్రీ‌రామ ర‌క్ష‌.

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన ఎన్నో పార్టీలు, ఆ త‌ర్వాత కాలంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన దాఖ‌లాలున్నాయి. 2019లో టీడీపీ 23 సీట్ల‌కు ప‌డిపోయి, ఇప్పుడు ఊహించ‌ని విధంగా అధికారంలోకి రావ‌డ‌మే అతిపెద్ద ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌భుత్వ ఫెయిల్యూర్స్  ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంటాయి. దీన్ని క్యాష్ చేసుకోడానికి ప్ర‌తిప‌క్షం ఓపిక‌గా ఎదురు చూడాల్సి వుంటుంది. వైసీపీకి ఎదురు దెబ్బ‌లు కొత్తేమి కాదు. ప్ర‌తి ఎదురు దెబ్బ నుంచి జ‌గ‌న్ రాటుదేలుతున్నారు. ఇప్పుడు మ‌రో ఎదురు దెబ్బ‌. దీని నుంచి జ‌గ‌న్ ఎలా బ‌య‌ట‌ప‌డతారో కాలం తేల్చ‌నుంది. జ‌గ‌న్‌లో స‌హ‌నం, ప‌ట్టుద‌ల ఎక్కువే. వైసీపీ భ‌విష్య‌త్‌ను కాలం, స‌హ‌నం తేల్చ‌నున్నాయి.