మూడు పార్టీలు కూటమి కట్టిన పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దఫా ఏకంగా అయిదు కేంద్ర మంత్రి పదవులు లభించబోతున్నాయి. కూటమి మూడు పార్టీలకు కలిపి ఈ పదవులు లభించబోతుండడం గమనార్హం.
2 స్థానాలు గెలిచిన జనసేనకు ఒకటి, 3 స్థానాలు గెలిచిన బిజెపిక ఒకటి, 16 స్థానాలు గెలిచిన తెలుగుదేశానికి మూడు కేంద్రమంత్రి పదవులు దక్కబోతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ భాజపాతో పొత్తు కొట్టి.. రాష్ట్రంలో విజయాలను నమోదు చేసినప్పుడే.. కింజరాపు రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి ఖరారు అయిపోయింది. ఆ పార్టీకి రామ్మోహన్ ను మించిన సీనియర్ ఎంపీ లేనే లేరు. అలాగే తమ పార్టీకి దక్కే మరో రెండు మంత్రి పదవులను తెలుగుదేశం ఎస్సీ వర్గాల చేతిలో పెట్టనున్నట్టు తెలుస్తోంది.
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, అమలాపురం ఎంపీ (జీఎంసీ బాలయోగి కొడుకు) హరీష్ మాథుర్ లను కేంద్రమంత్రులు చేయబోతున్నారు.
బిజెపి కోటాలో పార్టీ రాష్ట్ర అద్యక్షురాలు.. మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అవకాశం దక్కుతోంది. అదే సమయంలో జనసేన పార్టీ తరఫున లక్కీగా వల్లభనేని బాలశౌరి చాన్సు కొట్టేస్తున్నారు.
ఆ రకంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి మూడు పార్టీలకు విడివిడిగా ఎలా ఉన్నా.. కలిపి చూసినప్పుడు రాష్ట్రంలోని అయిదే కీలక కేంద్ర పదవులు ఒకటి- కమ్మ, ఒకటి- కాపు, ఒకటి-బీసీ, రెండు- ఎస్సీలకు పంచుతున్నట్టుగా అర్థమవుతోంది.
ఇదే సమయంలో మరొక వాదన కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో కేంద్రంలో స్పీకరుగా పనిచేసిన దివంగత నేత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ కు కేంద్ర మంత్రి పదవి కాకుండా, లోక్ సభ డిప్యూటీ స్పీకరు పదవి ఇవ్వవచ్చునని ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి ఏపీనుంచి కేంద్రమంత్రుల ఎంపిక పర్వం చాలా ఆచితూచి కులాల సమతూకం లెక్కలు వేసుకుంటూ చేస్తున్నారు.