పక్క చూపులు చూస్తున్న వైసీపీ నేతలు?

అధికారం పోయింది. అయిదేళ్ళ పాటు అందిన వైభోగాలు సరి అన్నట్లుగా మాయం అయ్యాయి. రిజల్ట్ వచ్చి నాలుగు రోజులు కాలేదు కానీ వైసీపీలో ముఖ్య నేతలు పక్క చూపులు చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షం…

అధికారం పోయింది. అయిదేళ్ళ పాటు అందిన వైభోగాలు సరి అన్నట్లుగా మాయం అయ్యాయి. రిజల్ట్ వచ్చి నాలుగు రోజులు కాలేదు కానీ వైసీపీలో ముఖ్య నేతలు పక్క చూపులు చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షం అన్న మాటను అసలు భరించలేమని అంటున్న నాయకుల తీరుని చూసి జనాలే షాక్ తింటున్నారు.

విశాఖలో వైసీపీ ఖాళీ అవుతోందని విశాఖ పశ్చిమ నుంచి హ్యాట్రిక్ విజయం దక్కించుకున్న పి గణబాబు ఒక ట్వీట్ వేసి కలకలం రేపారు. ఆయన మొత్తం వైసీపీ నేతలు అంతా కూటమి వైపు చూస్తున్నారు అని సీక్రెట్ ని బహిర్గతం చేశారు.

ఆ వచ్చే నేతలు ఎవరో పేర్లు చెప్పకపోయినా మొత్తం విశాఖలోనే వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పడం బట్టి చూస్తే పెద్ద తలకాయలే ముందుంటున్నాయని అంటున్నారు. అయితే విశాఖ టీడీపీ కిక్కిరిసి ఉందని తమకు జంపింగ్ జఫాంగులు అవసరం లేదని ఆయన ముఖాన చెప్పేస్తున్నారు. టీడీపీకి రాయబారాలు పంపినా తాము పట్టించుకోకపోవడంతో జనసేనలోకి బీజేపీలోకి వెళ్ళడానికి చూస్తున్నారు అని గణబాబు అంటున్నారు.

కేవలం అధికార దాహంతోనే వైసీపీ నేతలు చాలా మంది పార్టీలు మారుతున్నారని ఆయన అంటున్నారు. కనీసం రెండేళ్ల పాటు అయినా ప్రతిపక్ష పాత్ర పోషించలేరా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఓటమితో ఇటు వైపు వస్తున్న నాయకుల పట్ల మిత్రపక్షాలు కూడా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.

పార్టీ మారినా మిత్రుల పార్టీలలో ఉన్నా తప్పు చేసిన వారిని టీడీపీ వదిలిపెట్టదని హెచ్చరిస్తున్నారు. గణబాబు చెప్పారని కాదు చాలా మంది నేతలు సైలెంట్ గా ఉన్నారు. వారు ఫ్యూచర్ గురించి సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆ నేతలు ఎవరో వైసీపీ అధినాయకత్వం ఆరా తీసి జిల్లాలో పార్టీని గాడిలో పెట్టుకోకపోతే ముందు ముందు భారీ ముప్పు తప్పదనే అంటున్నారు.