ఫ్యాన్ పార్టీకి వీర ఫ్యాన్స్ వారే!

ఏపీలో ఎక్కడైనా ఫ్యాన్ తిరగకపోవచ్చు కానీ ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో మాత్రం గిర్రున తిరుగుతూనే ఉంది. 2014 నుంచి చూస్తే ఇప్పటికి మూడు ఎన్నికలు జరిగితే మూడు సార్లూ వైసీపీనే తప్ప మరో పార్టీని…

ఏపీలో ఎక్కడైనా ఫ్యాన్ తిరగకపోవచ్చు కానీ ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో మాత్రం గిర్రున తిరుగుతూనే ఉంది. 2014 నుంచి చూస్తే ఇప్పటికి మూడు ఎన్నికలు జరిగితే మూడు సార్లూ వైసీపీనే తప్ప మరో పార్టీని గెలిపించని చరిత్ర ఏజెన్సీ వాసులది.  అంతే కాదు ప్రతీ ఎన్నికకూ అభ్యర్ధులను మార్చినా కూడా గుర్తునే నమ్ముకుని ఓటేస్తున్న గిరిజనం వైసీపీ భక్తిని చూసి రాజకీయ పండితులు కూడా దండం పెట్టేస్తున్నారు.

అరకు పార్లమెంట్ పాడేరు, అరకు అసెంబ్లీలలో చూస్తే మూడు ఎన్నికల్లోనూ అభ్యర్ధులు మారారు. కానీ వైసీపీ కి ఓటేయడంలో గిరిజనులు ఏ మాత్రం మనసు మార్చుకోలేదు. అరకు ఎంపీకి 2014లో కొత్తపల్లి గీతను వైసీపీ నిలబెడితే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించారు. 2019లో గొడ్డేటి మాధవిని నిలబెడితే రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం చేకూర్చారు. తాజా ఎన్నికల్లో తనూజారాణి అనే యువ డాక్టర్ ని అభ్యర్ధిగా చేస్తే మంచి మెజారిటీ ఎంపీగా చేసి పార్లమెంట్ కి పంపుతున్నారు.

అసెంబ్లీ విషయానికి వస్తే 2014లో పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి పోటీ చేసి గెలిచారు. 2019లో కె భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే అయితే తాజా ఎన్నికల్లో విశ్వేశ్వరరాజు గెలిచారు. అరకు నుంచి చూస్తే 2014లో కిడారి సర్వేశ్వరరావు గెలిచారు. 2019లో చెట్టి ఫాల్గుణ గెలిస్తే 2024లో రేగం మత్స్య లింగం గెలిచారు.

ఇలా కేవలం పార్టీనే నమ్ముకుని గెలిపిస్తున్న గిరిజనులు ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ పరువు కాపాడుతున్నరు. ఎవరు ఎటు తిరిగినా తాము మాత్రం ఫ్యాన్ పార్టీకి ఊర మాస్ ఫ్యాన్స్ అని ఒట్టేసి మరీ చెబుతున్నారు. ఈ ఫలితాలను చూసి వైసీపీ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ సీట్లు వైసీపీకి పెట్టని కోటలను అభివర్ణిస్తున్నారు.