కొన్నాళ్ల కిందటి సంగతి.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసేందుకు అందుబాటులో ఉన్న నటీనటులు, పెద్దల్ని కలుపుకొని వెళ్లారు చిరంజీవి. మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి, కొరటాల శివ లాంటి సెలబ్రిటీలు కూడా ఆ భేటీలో ఉన్నారు. ఆ టైమ్ లో ఇండస్ట్రీ కోసం ఏపీ ప్రభుత్వం తరఫున కొన్ని సాధించేందుకు చిరంజీవి కీలకంగా వ్యవహరించారు.
ఎన్నో రోజులు కసరత్తు చేశారు, ఎన్నో సంప్రదింపులు జరిపారు. అలా జగన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి టాలీవుడ్ కు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇచ్చిన అన్ని హామీలు కాకపోయినా, కొన్నింటిని ప్రభుత్వం వెంటనే అమలు చేసింది. విడుదలైన తొలి వారం లేదా పది రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతిచ్చింది.
కట్ చేస్తే, ఐదేళ్లు గడిచిపోయాయి. ఏపీలో ప్రభుత్వం మారింది. మరోసారి చంద్రబాబు చేతికి పగ్గాలొచ్చాయి. మరి అప్పటి అదే చొరవను చిరంజీవి, ఈసారి కూడా కొనసాగిస్తారా? చంద్రబాబు సర్కారుతో చర్చలు మొదలుపెడతారా?
ఎన్నో వివాదాలు.. మరెన్నో అవమానాలు..
ఈ ప్రశ్నలు తలెత్తడానికి ప్రధాన కారణం.. గత భేటీలో చిరంజీవి చుట్టూ ముసురుకున్న వివాదాలు. ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలకు తెరతీసినప్పుడు, ‘భూములు పంచుకోవడానికి ఈ భేటీలు’ అంటూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్య చేశారు బాలకృష్ణ. ఆ టైమ్ లో బాలయ్యతో పాటు కొంతమంది వ్యక్తులు చిరంజీవి జరిపే సంప్రదింపులు, చర్చలకు దూరంగా ఉన్నారు.
ఈ వివాదాలు అక్కడితో ముగిసిపోలేదు. జగన్ తో చర్చలు సమయంలో కూడా కొన్ని తలెత్తాయి. చిరంజీవి లాంటి పెద్ద మనిషికి జగన్ సరైన మర్యాద ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో వరుసపెట్టి కథనాలొచ్చాయి. చిరంజీవి నమస్కారం చేస్తే, జగన్ కనీసం ప్రతినమస్కారం చేయలేదని, తనదైన శైలిలో నవ్వుతూ ఊరుకున్నారని, ఇది చాలా పెద్ద అవమానం అంటూ మెగా ఫ్యాన్స్ కొందరు దుమ్మెత్తిపోశారు.
అయితే అలా చేతులు జోడించి మాట్లాడ్డం చిరంజీవికి అలవాటు, ఇలా నవ్వుతూ తలూపడం జగన్ కు అలవాటనే విషయం ఆ తర్వాత అంతా అర్థం చేసుకున్నారు. అంతేకాదు, చిరంజీవిని తన నివాసంలో జగన్ ప్రత్యేకంగా సన్మానించిన విషయాన్ని సైతం కొంతమంది ఆ టైమ్ లో మరిచిపోయారు. మొత్తానికి జరగాల్సిన డ్యామేజీ అయితే జరిగిపోయింది.
ఈసారి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్..
వీటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే చిరంజీవి ఈసారి ముందుకు రాకపోవచ్చు. పద్మవిభూషణ్ అందుకున్న తర్వాత మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న చిరు, ఏ చిన్న వివాదానికి తావివ్వకుండా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి మరోసారి చర్చలకు తెరతీసే అవకాశం ఉందని అంటున్నారు కొంతమంది. దీనికి కారణం పవన్ కల్యాణ్.
అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో పెను మార్పులొచ్చాయి. ఈసారి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ఉన్నారు. కేవలం ఉండడం కాదు, చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నారు. కాబట్టి చిరంజీవి తలుచుకుంటే డేట్స్, మీటింగ్స్ అన్నీ క్షణాల్లో పూర్తవుతాయి. పైగా ఈసారి బాలయ్య నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు.
ఇండస్ట్రీ నుంచి కూడా చిరంజీవికి ఫుల్ సపోర్ట్ ఉండనే ఉంది. కాబట్టి చిరంజీవి మరోసారి చొరవ తీసుకుంటేనే అందరికీ మంచిది.