రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఆయన తన గురించి తాను ఎప్పుడూ చెప్పుకోలేదు. అలా చెప్పుకోవాలని కూడా అనుకోలేదు. మరణానంతరం ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే.
రామోజీ రావు తన స్మారకాన్ని తానే నిర్మించుకున్నారు. ఈ లోకాన్ని వీడిన తర్వాత తన స్మృతి వనం ఎలా ఉండాలనే డిజైన్ ను ఆయన దగ్గరుండి చేయించుకున్నారు. తన అభిరుచికి తగ్గట్టు ఫిలింసిటీలో స్మారకాన్ని కట్టించారు.
మరణం ఓ వరం అంటారాయన. చావు అంటే తనకు ఎలాంటి భయం లేదని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఆయన దేవుడ్ని నమ్మరు, కర్మను నమ్ముతారు. అందుకే బతికుండగానే తన స్మారకాన్ని తానే డిజైన్ చేయించుకొని, దగ్గరుండి నిర్మించుకున్నారు. అమెరికాతో పాటు, పలు యూరోప్ దేశాల్లో ఈ కల్చర్ ఉంది. తమ సమాధి లేదా స్మారకం ఎలా ఉండాలి, చనిపోయిన తర్వాత బంధువులు, స్నేహితులకు ఎలాంటి పార్టీ ఇవ్వాలి, తమ సమాధిపై ఏం రాయాలి లాంటి అంశాల్ని వ్యక్తులు ఎంచుకోవచ్చు. దానికి తగ్గ ప్యాకేజీ తీసుకోవాల్సి ఉంటుంది. మరణాంతరం వాళ్లు కోరుకున్న విధంగా అంత్యక్రియలు నిర్వహించి, స్మారకాన్ని నిర్మిస్తారు.
ఫిలింసిటీలో సువిశాలమైన స్థలంలో చుట్టూ పెంచిన చెట్ల మధ్య ఓ సుందరమైన కట్టడం ఈ స్మారకం. రామోజీకి తెలుపు, పసుపు రంగులంటే ఇష్టం. అందుకే స్మారకంలో స్తంభాలకు ఈ రెండు రంగుల్నే వేశారు. తన అంత్యక్రియలు ఇక్కడే జరగాలని ఆయన కోరుకున్నారు.
కాబట్టి ఇందులోనే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రేపు రామోజీ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఈ ప్రాంతాన్ని ఇప్పటికే పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. రామోజీ మనవడు అమెరికా నుంచి రావాల్సి ఉంది. ఆయన వచ్చిన వెంటనే అంత్యక్రియలు జరుగుతాయి.