ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం-జనసేన- బీజేపీల కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 స్థానాల్లో కూటమి ఎమ్మెల్యేలే నెగ్గారు. ఈ నేపథ్యంలో.. మంత్రి వర్గం కూర్పు ఆసక్తిదాయకమైన అంశంగా మారింది. ఏకంగా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండటం, అందునా మూడు పార్టీలూ మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కోరుకోనున్న నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ లో స్థానం ఎవరికి అనేది ఆసక్తిదాయంగా మారుతోంది.
కూటమిలో నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీదే మెజారిటీ వాటా. మంత్రి వర్గంలో కూడా మెజారిటీ బెర్తులు తెలుగుదేశం పార్టీకే దక్కుతాయి. అయితే జనసేన ఏమీ ప్రతిపక్షంలో కూర్చోదు! తను పోటీ చేసిన 21 స్థానాల్లోనూ నెగ్గిన జనసేన కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యాన్నికోరుకుంటుంది. స్వయంగా పవన్ కల్యాణే మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎంగా చేస్తారనే ప్రచారం ఉంది. అయితే ఏపీలో డిప్యూటీ సీఎం అనే హోదా ఏ మాత్రం చెప్పుకోదగనిదిగా మారింది.
2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు కేబినెట్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలుండే వారు. నిమ్మకాయల చిన్న రాజప్ప, కేఈ కృష్ణమూర్తి అప్పుడు డిప్యూటీ సీఎంలుగా వ్యవహరించారు. ఇక జగన్ కేబినెట్లో అయితే ఏకంగా ఐదు మంది డిప్యూటీ సీఎంలు ఉండే వారు. మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు ఇలా జగన్ డిప్యూటీ సీఎం హోదాలను ఇచ్చారు. కాబట్టి.. ఇప్పుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అనగానే.. ఆయనకు పెద్ద హోదా దక్కినట్టుగా అయిపోదు. ఒకవేళ గత పదేళ్లలో ఏపీలో అంతమంది మాజీ డీప్యూటీ సీఎంలు లేకపోతే పవన్ కే తొలి సారి అలాంటి హోదా దక్కేట్టుగా అయితే అది చెప్పుకోదగినది అయ్యేది. ఇప్పుడు పవన్ కే కాకుండా మరో ఇద్దరు ముగ్గురుకు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం హోదాలను ఇచ్చే అవకాశం ఉంది! కాబట్టి.. కేవలం డిప్యూటీ సీఎం అనేది కాకుండా, పవన్ కల్యాణ్ కు ఏ శాఖ దక్కుతుందనేది కూడా కీలకమైన అంశం.
ఒకవేళ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే గా కాకుండా ఎంపీగా పోటీ చేసి ఉంటే, నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు ఆయనను కేంద్రం వైపు పంపించేసే వారు. ఎలాగూ కేంద్రంలో ఎన్డీయే సర్కారే ఏర్పడుతూ ఉంది కాబట్టి, పవన్ కల్యాణ్ కు ఏదో ఒక కేంద్రమంత్రి పదవిని దక్కేలా చేసి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తనకు ఇబ్బంది లేకుండా చూసుకునే వారు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ అర్జెంటుగా కేంద్రమంత్రి అయ్యే అవకాశాలు లేవు. రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకుని పవన్ కేంద్రమంత్రి కావొచ్చు.
ప్రస్తుతానికి ఆయన మంత్రి పదవి స్వీకారం అయితే చేయొచ్చు. కానీ అదే జరిగితే పిఠాపురం ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆదిలోనే అలా చేస్తే.. అదో పెద్ద హంసపాదు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. పవన్ అలాంటి పనికి పూనుకోకపోవచ్చు! చంద్రబాబు కేబినెట్లో మంత్రిగానే ఆయన సర్దుకునే అవకాశం ఉంది.
మరి పవన్ పై ఆయన అభిమానులకు చాలా అంచనాలున్నాయి. కాబట్టి ఆయన హోదాకు తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ఏ మంత్రి పదవిని ఇస్తారు, ఎన్ని పవర్స్ ను ఇస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది. ఇక ఎనిమిది ఎమ్మెల్యే సీట్లతో బీజేపీ కూడా మంత్రి పదవులను కోరుకునే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీకి మంత్రి పదవులే ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టే వారేమో, కానీ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మంత్రి పదవులను కోరుకుంటూ ఉంది.
ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఆ పార్టీ కేబినెట్లో భాగం అయ్యే అవకాశాలున్నాయి. ఎనిమిది ఎమ్మెల్యే ల బలం కూడా ఆ పార్టీకి ఉంది కాబట్టి, కనీసం ఒకటో రెండో మంత్రి పదవులు అయినా బీజేపీ ఆశించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని నిరాకరించే అవకాశాలు లేనట్టే! జనసేన, బీజేపీలో కోటాలో కనీసం ఐదు మంత్రి పదవులు అయినా పోయే అవకాశాలున్నాయి. ఇక మిగిలిన బెర్తులపై తెలుగుదేశం పార్టీ నుంచి నెగ్గిన 130 మందికిపైగా ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకోవాల్సిందే!
కేబినెట్లో అన్ని శాఖలకూ ఒక్కో మంత్రిని పెట్టేసి, బస్సు నిండే స్థాయిలో మంత్రి పదవులను ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఆసక్తితో ఉండకపోవచ్చు. కేబినెట్లో కొన్ని బెర్త్ లను ఖాళీగా ఉంచి, కొన్ని బెర్తులను మిత్రపక్షాలకు కేటాయించి ఆ తర్వాత సొంత పార్టీ వాళ్లను సంతృప్తి పరచడానికి ఆయన ప్రణాళిక రచించుకుని ఉండాలి. ఎమ్మెల్యేగా నెగ్గిన వెంటనే రాజకీయ నేతలకు పుట్టే ఆశలు మంత్రి పదవి మీదే. దీనికి తెలుగుదేశం తరఫున ఇప్పుడు నెగ్గిన వారు ఏ మాత్రం మినహాయింపు కాదు.
అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ అనేక మంది ఆశావహులు అప్పుడే తమ ప్రయత్నాల్లో తామున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. 2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా పని చేసిన వారిలో చాలా మంది ఇప్పుడు తమకు అవకాశం దక్కి తీరుతుందనే విశ్వాసంతో ఉన్నారు. అప్పుడే మంత్రులుగా చేసిన తమకు ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వాలనే తీరు వారిలో కనిపిస్తూ ఉంది. అలాగే కొత్త వాళ్లు, భారీ మెజారిటీలతో నెగ్గిన వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాము పోరాడామని చెప్పుకుంటున్న వాళ్లు. .. ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో గట్టి ఆశలతో కనిపిస్తూ ఉంది. మరి వీరిలో ఎవరి ఆశలు ఇప్పుడు ఫలప్రదం అవుతాయనేది ఆసక్తిదాయకమైన అంశం.
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయనపై పోటీ చేసి ఓటమి పాలైన బీటెక్ రవి తనకు ఇప్పుడు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నారట! తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రి పదవి ఇస్తారనే ధీమాను బీటెక్ రవి తన వారి వద్దన వ్యక్తం చేస్తూ ఉన్నారట! అప్పుడే జగన్ ను మరింత గట్టిగా ఎదుర్కొనడానికి వీలుంటుందని ఆయన ప్రచారం చేసుకుంటున్నట్టుగా భోగట్టా!
ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రి పదవులు విషయంలో గట్టి పోటీ ఉందట! 2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు నాయుడు కేబినెట్లో ప్రాతినిధ్యం వహించిన అఖిలప్రియ ఇప్పుడు తనకు అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారట! అలాగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గిన ముస్లిం ఎమ్మెల్యేల్లో ఒకరైన తెలుగుదేశం పాత కాపు ఫరూక్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారని భోగట్టా. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబం, కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీ తరఫున పని చేశాయి. ఎన్నికల్లో కూడా వారు నెగ్గుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారి ఆశలు కూడా గట్టిగానే ఉన్నాయని భోగట్టా!
ఇక అనంతపురం జిల్లాలో టీడీపీ స్వీప్ చేసింది. అక్కడ నుంచి బీసీ ఎమ్మెల్యేలు, కమ్మ ఎమ్మెల్యేలు మంత్రి వర్గంలో ఆశలను పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిలో ఎవరి ఆశలు నెరవేరతాయి అనేది రాజకీయ చర్చగా మారుతూ ఉంది. ఒకవేళ కొద్దో గొప్పో తక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఉంటే అదో కథ. అయితే ఇప్పుడు కూటమి రూపంలో సభ నిండా తెలుగుదేశం పార్టీనే ఉంది. దీంతో ఆశావహుల సంఖ్య అమాంతం పెరిగింది. మరి ఎవరి ఆశలు ఏ మేరకు నెరవేరతాయో చూడాలి!