ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనాత్మకం. ఇందులో ఎలాంటి సందేహం లేదు, రాజకీయ పండితుల అంచనాలు, కుల సమీకరణాలు, ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలతలు.. ఇలాంటి అంచనాలు అన్నీ చెల్లాచెదురు అయ్యాయి ఏపీ ఎన్నికల ఫలితాల్లో! 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 164 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించింది. వీటిల్లో గత రెండు దశాబ్దాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
సెంటిమెంట్లు, చరిత్రలు, కంచుకోటలు, అభ్యర్థుల బలాబలాలు, స్థానిక సమీకరణాలు ఇలాంటివేవీ ఎన్నికల ఫలితాల్లో నిలవలేదు! ఇలాంటి సంచలన ఫలితాలన్నింటిలో కూడా మరి కొన్ని ఫలితాలు మరింత సంచలనాలుగా నిలిచాయి. అలాంటి వాటిల్లో ఒకటి సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజవకర్గం ఫలితం!
ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ దాదాపు మూడు వేల ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విజయం సాధించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 20 సంవత్సరాల నుంచి ధర్మవరంలో పని చేసుకుంటూ వస్తున్నారు. 2005లో కాంగ్రెస్ ఇన్ చార్జిగా ధర్మవరంలో ఎంట్రీ ఇచ్చిన వెంకట్రామిరెడ్డి 2009 ఎన్నికల్లో తొలి సారి పోటీ చేసి నెగ్గారు. ఆ తర్వాత 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో మళ్లీ నెగ్గారు. ఇప్పుడు ఓడిపోయారు! అయితే బీసీల ఓట్ల వాటా గట్టిగా ఉన్న ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడం కన్నా, ఎన్నికలకు నెల ముందు నియోజకవర్గంలో అడుగుపెట్టిన వ్యక్తి అక్కడ నెగ్గడం పెను సంచలనం అని చెప్పాలి!
సత్యకుమార్ ఎవరో కూడా ధర్మవరం ప్రజలకు తెలియదు! ఆయన ఎక్కడ నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో కూడా ఎవరికీ ఎరుక లేదు! స్థానికుడా కాదు, అసలు ఆయన కులం పేరును కూడా ఊరికే పెట్టుకున్నారని, ఆయన యాదవ్ కాదనే అభిప్రాయాలూ వినిపించాయి. కేతిరెడ్డి గత ఐదేళ్లలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నియోజకవర్గంలోని ప్రతి వీధినీ టచ్ చేశాడు. ప్రతి ఇంటినీ పలకరించాడు.
కరోనా రెండేళ్ల ను మినహాయిస్తే మూడు సంవత్సరాల్లో కేతిరెడ్డి నియోజకవర్గంలోని డోర్ టూ డోర్ పలకరించాడు. సమస్యలను విన్నాడు, చేతనైనవి పరిష్కరించాడు, ప్రజలకు అయితే సమాధానాలు ఇచ్చాడు. ఇక సంక్షేమ పథకాలు సరేసరి! ప్రత్యేకించి ధర్మవరం నియోజకవర్గంలో సుమారు లక్ష సాలె కులస్తులు ఉంటారు. వీరికి జగన్ ప్రభుత్వం చేనేత నేస్తం అంటూ ఐదేళ్ల పాటు ప్రతి ఏడాదీ 18 వేల రూపాయల చొప్పున ఇచ్చింది. ఒక్కో మగ్గం ఉన్న వారు, లేని వారు కూడా ఆ పథకం లబ్ధిని పొందారు!
పల్లెల్లో రెడ్ల జనాభా ఉంది. అక్కడకూ పల్లెల కౌంటింగ్ ముగిసే సమయానికి కేతిరెడ్డికి పది వేల ఓట్ల మెజారిటీ దక్కింది. అయితే ఆఖరి రౌండ్లలో టౌన్ కౌంటింగ్ మొదలయ్యే సరికి కథ మారిపోయింది. పల్లెలన్నింటినీ కలిపి 10 వేల మెజారిటీ తెచ్చుకున్న కేతిరెడ్డికి, టౌన్లో ఆ పది వేల మెజారిటీ కరిగిపోయి, బీజేపీ కి మూడు వేల కు పైగా మెజారిటీ దక్కింది! పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సానుకూలత అలా తేటతెల్లం అయినా, భారీ ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకున్న చేనేతలు ఎవరో కూడా తెలియని అభ్యర్థి వైపే మొగ్గు చూపారు నియోజకవర్గంలో వీధివీధీ తిరిగిన అభ్యర్థిని ఓడించారు!