2024 ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించిన కూటమి గురించి ఇప్పుడు ఎదురవుతున్న తొలి ప్రశ్నల్లో ఒకటి.. ఆ కూటమి తను ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇచ్చిన హామీలను అమలు పరుస్తుందా? అనేది! ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు లెక్కలేనన్ని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మెనిఫెస్టోలను డిలీట్ కూడా చేయడం కొత్త ఏమీ కాదు! ఇలాంటి నేపథ్యంలో అనవిగాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాటిని ఏ మేరకు అమలు చేస్తాడనే ప్రశ్న తలెత్తడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్లు, ఆ కూటమి నేతలు తమ హామీలను హోరెత్తించారు. ఇంటింటికీ తిరిగి.. తమకు అధికారం ఇస్తే అన్నీ ఫ్రీ అనే హామీలను వివరించి చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇంట్లో ఎంతమంది పిల్లలలుంటే అంతమందికీ అమ్మ ఒడి లాంటి పథకం అనే ప్రచారానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఒక్కో పిల్లాడికి సంవత్సరానికి 15 వేల రూపాయలో, పాతిక వేల రూపాయలోనట! ఆ పై ఏపీలో ఉన్న ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలట! 18 సంవత్సరాలు నిండిన, 50 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలు ఇస్తారట! ఇవి గాక.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
ఇవేనా.. ఈ ఏడాది మార్చి సంవత్సరం నుంచినే నెలకు 4 వేల రూపాయల చొప్పున పెన్షన్ పెంచేసినట్టుగా కూడా ప్రకటించారు. అధికారం దక్కి, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకా కాదు… గత ప్రభుత్వ హయాంలోని మార్చి, ఏప్రిల్, మే నెలల పెంపు పెన్షన్ ను కూడా జూలై మొదట్లోనే ఇవ్వబోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అంటే జూలై నెలలో ప్రతి వృద్ధాప్య పెన్షనర్ కూ ఏడు వేల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నామని తెలుగుదేశం నేతలు లెక్క గట్టి వివరించారు.
అయితే కూటమి హామీలు ఇంతటితో ఆగలేదు! మెగా డీఎస్సీని ప్రకటిస్తామని, వలంటీర్ల జీతాలను పది వేల రూపాయలకు పెంచుతామని, ఆ పై సుమారుగా 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వబోతున్నట్టుగా కూడా ప్రకటించారు! ఇవేనా.. ఇంకా చెప్పాలంటే రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని, అదీ గాక ఇంకా పండుగ కానుకలు, అన్నా క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని కూడా పచ్చ పార్టీ కూటమి హామీలు గుప్పించింది. ఈ హామీల దండకాన్ని చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ చదివి వినిపించారు! పవన్ కల్యాణ్ కూడా ఈ హామీలను బట్టీ పట్టి చదివి వినిపించారు!
మరి ఈ హామీలు ఆచరణ సాధ్యమా అనే ప్రశ్నను అప్పుడు వేస్తే.. తమకు అధికారం ఇస్తే వాటిని అమల్లో పెట్టి చూపిస్తామనే ధీమా పచ్చ కూటమి నుంచి వినిపించింది. చంద్రబాబు నాయుడు అంటే మాటలు కాదని, ఆయన సంపదను సృష్టిస్తాడని, సంపదను సృష్టించి ఇలాంటి అసాధ్యం అనుకున్న హామీలన్నింటినీ అమలు చేస్తారంటూ పచ్చ పార్టీ సానుభూతి పరులు చెప్పారు! ఎప్పుడో మళ్లీ ఐదేళ్లకు ఎన్నికల ముందు హామీలను అమలు పరచడం కాదు, అధికారం దక్కిన మరుసటి నెల నుంచినే అన్ని హామీలనూ అమలు పరుస్తామంటూ పచ్చ పార్టీ ప్రచారం చేసింది! అయితే ఇవన్నీ అమలుకు సాధ్యం అయ్యే హామీలు కావనేది ఆర్థిక వేత్తల మాట, ఈ హామీలను అమలు పరచాలంటే స్విస్ బ్యాంకును దోచుకున్నా సాధ్యం కాదనే ముందు నుంచినే వినిపిస్తూ ఉంది.
చంద్రబాబు హామీలను అమలు పరచాలంటే ఏటా కనీసం 12 లక్షల కోట్ల రూపాయల అవసరం అని, అయితే ఏపీ ప్రస్తుత వాస్తవిక బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలకు మించి లేదని ఆర్థిక వేత్తలు లెక్కలేసి చెప్పారు! ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను అన్నింటినీ పక్కన పెట్టేసి, టీడీపీ మెనిఫెస్టోని యథాతథంగా అమలు చేయాలంటే ఏడాదికి 12 లక్షల కోట్ల రూపాయలు సరిపోవనే వాదన ఉంది.
అయితే వాటిని నమ్మ వద్దని తమకు అధికారం ఇస్తే అన్ని హామీలనూ అమలు చేస్తామనే వాదన పచ్చ పార్టీ వినిపించింది. చంద్రబాబు నాయుడు అదే చెప్పారు. హామీల అమలుకు తను ష్యూరిటీ అని, గ్యారెంటీ అని కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు! మరి అసలు కథ ఎలా ఉంటుందో.. ఇక వచ్చే నెల నుంచి బిగ్ స్క్రీన్ పై చూడొచ్చు!