మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీకి సంబంధించి మార్గదర్శి ఫైనాన్ష్ సంస్థ అక్రమాలపై ఉండవల్లి అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దివంగత వైఎస్సార్ హయాంలో రామోజీ సంస్థపై ఉండవల్లి ఫిర్యాదుతోనే అక్రమాల డొంక కదిలింది. వైఎస్సార్ మరణించినా, రామోజీపై అరుణ్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రామోజీ మరణవార్తపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రామోజీరావు మరణవార్త తనకెంతో బాధ కలిగించిందన్నారు. శాస్త్రాల ప్రకారం జీర్ణ వస్త్రాల్ని త్యజించి కొత్త బట్టలు వేసుకున్నట్టే, జన్మ చాలించడం కూడా అలాంటిదే అని ఆయన అన్నారు. రామోజీ పూర్తి జీవితం గడిపారని ఉండవల్లి పేర్కొన్నారు. ఎవరితో రాజీపడకుండా ఒక ఫైటర్‌గానే కాలధర్మం చెందారని వెల్లడించారు.
రామోజీరావును కలవాలని చాలా సార్లు ప్రయత్నించినట్టు ఉండవల్లి తెలిపారు. కానీ కలవలేకపోయానన్నారు. రామోజీ విషయంలో అదొక్కటే తనకు అసంతృప్తి అంటూ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ ఏ రంగంలో ప్రవేశించినా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారని ఆయన అన్నారు.
భారతదేశంలో రామోజీలాంటి పలుకుబడి కలిగిన వ్యక్తిని మరొకరిని చూడలేదన్నారు. మనిషన్న తర్వాత మరణం తప్పదన్నారు. రామోజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.