రామోజీ – పరాజయాలు

మీడియా టైకూన్ రామోజీ రావు పేరు చెప్పగానే అనేకానే విజయాలు కళ్ల ముందుకు వస్తాయి. ఆయన పట్టుదలగా నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం, సాధించిన ఘన విజయాలు అందరూ చెబుతారు. మాట్లాడతారు. కానీ ప్రతి ఒక్కరికీ…

మీడియా టైకూన్ రామోజీ రావు పేరు చెప్పగానే అనేకానే విజయాలు కళ్ల ముందుకు వస్తాయి. ఆయన పట్టుదలగా నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం, సాధించిన ఘన విజయాలు అందరూ చెబుతారు. మాట్లాడతారు. కానీ ప్రతి ఒక్కరికీ విజయాలు వుంటాయి. అపజయాలు వుంటాయి. రామోజీ రావు కు కూడా అనేకానేక అపజయాలు వున్నాయి.

అయితే ఆయన గొప్పతనం ఏమిటంటే, ఇది ఇక ఇంతే అనుకున్నపుడు, వెంటనే దాన్ని వదిలేసి, వేరేది పట్టుకోవడం.

అలాంటివి కొన్ని ముచ్చటించుకుందాం.

రామోజీ గొప్ప విజనరీ. ఎంత విజనరీ అంటే ఆయన కొత్తగా ఆలోచించి, ప్రారంభించి, ఫెయిలై, వదిలేసినవి అన్నీ ఇప్పుడు ఈ తరంలో చేసి వుంటే సూపర్ హిట్ లు. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్లు అంతా అవే చేస్తున్నారు.సక్సెస్ సాధిస్తున్నారు. రామోజీ చాలా అంటే చాలా ముందుగా చేసేసారు వాటిని. ఇప్పుడు చేసి వుంటే ఆయన విజయాల పరంపరలో అవీ చేరేవి ఏమో?

సోమ డ్రింక్స్

పౌచ్ ల్లో జ్యూస్ లు అన్న ఆలోచనను దేశంలోనే ముందుగా చేసింది రామోజీ రావు నే. 70వ దశకంలోనే సోమ అనే బ్రాండ్ నేమ్ తో, మూడు నాలుగు రకాల పళ్ల రసాలను ఆయన మార్కెట్ లోకి ప్రవేశ పెట్టారు. ఇవి సీసాల్లో, పౌచ్ ల్లో అందించారు. జామపళ్ల రసం అన్నది ఇప్పుడు అందరికీ పరిచయమే. జంధ్యాలతో నిర్మించిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాటల చిత్రీకరణలో ఈ సోమ పళ్ల రసాల పౌచ్ లు, సీసాలను చూడొచ్చు. తొలిసారి ఆ రోజుల్లోనే అందించారు. అయితే సోమ జ్యూస్ వ్యాపారం అస్సలు క్లిక్ కాలేదు. దాంతో చాలా త్వరగానే ఆ వ్యాపారాన్ని వైండప్ చేసారు.

న్యూస్ టైమ్

ఈనాడు సూపర్ హిట్ అయిన తరువాత రామోజీ దృష్టి ఇంగ్లీష్ మీడియా మీద పడింది. ముంబాయి నుంచి ఓ ఏజెన్సీని అపాయింట్ చేసి, ఓ పత్రిక ఎలా వుండాలి అన్నది డిజైన్ చేయించి, న్యూస్ టైమ్ అనే ఇంగ్లీష్ పత్రికను చాలా అంటే చాలా భారీ ఖర్చుతో ప్రారంభించారు. నిష్ణాతులను ఏరి కోరి, ఆ రోజల్లోనే భారీ జీతాలు ఇచ్చి అపాయింట్ చేసుకున్నారు. న్యూస్ టైమ్ అనే లోగో ఫాంట్ దగ్గర నుంచి పత్రికలో అతి చిన్న అక్షరం వరకు ఒకటే తరహా ఫాంట్. ప్రతి రోజూ బ్యాక్ పేజీలో లెన్స్ టైమ్ శీర్షికతో విభిన్న ఫొటోలు. ప్రతి ఆదివారం టాబ్లాయిడ్ సైజ్ లో సండే మ్యాగ్ జైన్. చాలా క్వాలిటీగా, విభిన్నంగా అందించారు. కానీ డెక్కన్ క్రానికల్ ను అస్సలు ఢీకొనలేకపోయారు. చాలా హై క్లాస్ డైలీగా వుండేది న్యూస్ టైమ్. మాస్ డైలీగా వుండేది క్రానికల్. అయినా పట్టుదలగా చాలా అంటే చాలా ఏళ్లు నష్టాలు భరిస్తూ న్యూస్ టైమ్ ను నడిపారు. ఆఖరికి మూతపెట్టేసారు.

మయూరి ఫిలింస్

సినిమా పంపిణీ రంగంలో ప్రవేశించి మయూరి ఫిలింస్ స్టార్ట్ చేసారు. ఆ రోజుల్లోనే థియేటర్లు లీజకు తీసుకున్నారు. ప్రతి ఏరియాకు రిప్రజెంటేటివ్ లు, మేనేజర్లు, ఇలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసారు. దాంతో పాటే సినిమాల నిర్మాణం ప్రారంభించారు. అక్కడ కూడా సినిమా నిర్మాణాన్ని వ్యవస్ధీకృతం చేయాలని, అంతా వైట్ అండ్ వైట్ వ్యాపారం చేయాలని ప్రయత్నించారు. అయితే అప్పటికి సినిమా రంగంలో 70 శాతం బ్లాక్ నడుస్తోంది. రామోజీ విధానాలు నప్పలేదు చాలా మందికి. షూటింగ్ టైమ్ లో వృధా తగ్గించాలనే ప్రయత్నాలు చేసారు. ఇవీ నప్పలేదు ఆ వ్యవస్థకు. ప్రతి పట్టణంలో సినిమాల పోస్టర్ల కోసం హోర్డింగ్ లు ఏర్పాటు చేసుకున్నారు. మయూరి పంపిణీ, నిర్మాణ సినిమాల కోసం ఫిక్స్ డ్ హోర్డింగ్ లు అన్న మాట. కానీ ఈ రంగంలో రామోజీ విధానాలు నడవలేదు. మంచి సినిమాలు తీసారు తప్ప, నిర్మాణాన్ని కొనసాగించలేదు. పంపిణీని కూడా దాదాపు గా వదిలేసారు.

సితార అవార్డులు

ఫిలిం ఫేర్ అవార్డుల మాదిరిగా సితార అవార్డులు ప్రవేశపెట్టారు. చాలా భారీగా, నిక్కచ్చిగా, పబ్లిక్ గా అవార్డ్ ఫంక్షన్ లు నిర్వహించారు. కానీ అప్పటికి ఇంకా సినిమా నిర్మాణం మొదలుపెట్టలేదు. సినిమా నిర్మాణం స్టార్ట్ చేసిన తరువాత సితార అవార్డులు ఇవ్వడం సరికాదు అని ఆయనకు ఆయనే నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఓ బహిరంగ ప్రకటన ద్వారా తన మీడియాలో తెలియ చేసి, సితార అవార్డులను ఆపేసారు.

మ్యాగ్ జైన్లు

పిల్లల కోసం, తెలుగు కోసం మంచి పత్రికలు తేవాలని ప్రయత్నించారు. కానీ అవి క్లిక్ కాలేదు. ఎంత ప్రచారం చేసినా ఆదరణ రాలేదు. దాంతో వాటిని మూసేసారు. ఓ మంచి వార పత్రికను తేవాలని ప్లాన్ చేసారు. దాని కోసం చాలా వరకు గ్రవుండ్ వర్క్ చేసారు. కానీ అది కూడా ఆరంభించలేదు.

కళాంజలి

కళాంజలి పేరు ముందుగా వివిధ కళారూపాల అమ్మకాలు మొదలుపెట్టారు. ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ నడుస్తున్న లేపాక్షి స్టోర్ల మాదిరిగా. వివిధ హ్యాండీ క్రాఫ్ట్స్, పెయింటింగ్స్ ఇలా అన్నీ విక్రయించేవారు కానీ అవి అంతగా క్లిక్ కాలేదు. అదే బ్రాండ్ ను బట్టల దుకాణాలుగా మార్చారు. ఇప్పటికీ నడుస్తున్నాయి కానీ, ఏమంత విజయాలు సాధించలేదు. కళాంజలికి ఎక్స్ టెన్షన్ గా భారీ, హై ఫై దుస్తుల దుకాణం కూడా హైదరాబాద్ లో ప్రారంభించారు. కానీ అదీ క్లిక్ కాక మూసేసారు.

డాల్ఫిన్ హొటల్

విశాఖలో మోడరన్ స్టార్ హోటల్ గా డాల్ఫిన్ హోటల్ ను అద్భుతంగా నిర్మించారు. కానీ అది కూడా అన్నింటిలో ఒక హొటల్ గా నిలిచింది తప్ప, నెంబర్ వన్ కాలేకపోయింది. దస్ పల్లా, గ్రీన్ పార్క్, ఆ తరువాత నోవాటెల్ వచ్చి ఇప్పటికీ లీడ్ లో వుంటున్నాయి తప్ప, డాల్ఫిన్ హోటల్ లీడ్ లోకి రాలేకపోతోంది.

తెలుగు పదకోశం

ఇంగ్లీష్- తెలుగు డిక్షనరీ అన్నది రామోజీ కల. ఎన్నో డిక్షనరీ లు వున్నాయి. కానీ ఈనాడు వైపు నుంచి ఓ సమగ్రమైన, నభూతొ. .అనే మాదిరిగా ఒకటి తేవాలని సంకల్పించారు. కొన్ని ఏళ్ల పాటు దీని కోసం సిబ్బందిని పోషించారు. చాలా అంటే చాలా.. వేలాది పదాల అనువాద కార్యక్రమం నిత్యం ఓ క్రతువు మాదిరిగా సాగించారు. కానీ దాన్ని కూడా పక్కన పెట్టేసారు.

ఏమైనా సరే… రామోజీ రావు. ఓ గొప్ప వ్యక్తి. కొత్తగా ఆలోచించడం, ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టడానికి సైతం మరింత బలంగా శ్రమించడం, అలా అమలులో పెట్టిన దాన్ని నిలబెట్టడం కోసం తన మేధస్సు, శక్తి, వనరులు అన్నీ వాడడం, నిర్విరామంగా శ్రమిస్తూ ముందుకు సాగడం అనే లక్షణాలు ఈనాటి యువతకు ఆదర్శం. ఓ ప్రొడెక్ట్ లేదా ఓ సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో రామోజీ ఆలోచనలు వేరు.

రామోజీ జీవితంలోని భిన్న కోణాలు, ఆచరణలో పెట్టిన అనేక విధానాలు ఇలా చాలా పాయింట్ల మీద పిహెచ్డీ థిసీస్ లు చేయవచ్చు. అంత వుంది ఆయన జీవితం.